రైతులపై మీకు ఉన్న శ్రద్ధ ఇదేనా..?
♦ ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి
♦ సరిగా స్పందించడం లేదని వ్యాఖ్య
♦ రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఉండాలన్న ధర్మాసనం
♦ సూచనలు, సలహాల అమలుపై నిర్ణయానికి ఆరు వారాల గడువు
♦ వాటిని అమలు చేస్తే ఆత్మహత్యలు కనీస స్థాయికి వస్తాయని ఆశాభావం
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సలహాలు, సూచనలను తమకు సమర్పించడంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ తీరు అంత సంతృప్తికరంగా లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతు ఆత్మహత్యల నివారణ అంశం గురించి విచారణ సమయంలో తాము అడిగేంత వరకూ ఏపీ ప్రభుత్వం స్పందించలేదని.. ‘ఇదేనా మీకు రైతులపై ఉన్న శ్రద్ధ?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం రైతు ఆత్మహత్యల నివారణకు పలువురు మేధావులు, వ్యవసాయవేత్తలు ఇచ్చిన సూచనలు, సలహాల అమలుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆరు వారాల గడువునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ, స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేలా ఉభయ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్, ఇతరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హై కోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.
సలహాలు అద్భుతంగా ఉన్నాయి....
ధర్మాసనం ఆదేశాల మేరకు రైతు ఆత్మహత్యల నివారణకు మేధావులు, వ్యవసాయవేత్తలు, పిటిషనర్లు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశామని, ఇందులో పలు సూచనలు, సల హాలు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ తెలిపారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం ఈ సూచనలు, సలహాల్లో కొన్ని అత్యద్భుతంగా ఉన్నాయంది. వాటిని అమలు చేస్తే రైతు ఆత్మహత్యలను కనీస స్థాయికి తీసుకురావడం సాధ్యమవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. వ్యవసాయ కమిషన్ ఉండాలన్న సూచన చాలా బాగుందని, వివిధ వర్గాల ప్రజలకు కమిషన్లు ఉన్నప్పుడు, రైతుల సంక్షేమం కోసం ఎందుకు కమిషన్ ఉండకూడదు? అని ప్రశ్నించింది. దాని ఏర్పాటు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి శరత్ స్పందిస్తూ, సూచనలు, సలహాల అమలు విషయంలో ప్రభుత్వం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, అయితే కొన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించినవి కాగా, మరికొన్ని ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయని, అందువల్ల లోతుగా విశ్లేషణ జరిపి తుది నిర్ణయం తీసుకునేందుకు 8 వారాల గడువు కావాలని కోరారు. అది సుదీర్ఘ సమయమని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఆరు వారాల గడువును ఇచ్చింది. ఈ సందర్భంగా.. ‘‘తెలంగాణ సర్కార్ తాము నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలను పూర్తిస్థాయిలో మా ముందుంచింది, అయితే ఏపీ సర్కార్ ఆ పని చేయలేకపోయింది..’’ అని వ్యాఖ్యానిస్తూ ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది.