సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర మహోద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డిని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. బయట సమైక్యాంధ్ర గానం చేస్తూ.. లోపల వేర్పాటువాదాన్ని బలంగా చాటిచెబుతోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఉద్యమాన్ని తప్పుదోవపట్టించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దించారు. ఆది నుంచి జేసీ కుటుంబంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ వస్తోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే.. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి జేసీతో కలిసి ముందుకు సాగుతున్నారు. ‘రాయల తెలంగాణ’కు అనుకూలంగా జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో బహిరంగంగా సంతకాల సేకరణ చేస్తోంటే.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో రహస్యంగా సంతకాలను సేకరిస్తూ మద్దతు కూడగడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జూలై 30న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ప్రకటన చేసిన నిమిషాల్లోనే ‘అనంత’ నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానంలా వ్యాపించి.. మహోగ్ర రూపం సంతరించుకుంది. 99 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతోన్న ఉద్యమమే అందుకు తార్కాణం. ఓట్లు, సీట్లే లక్ష్యంగా కుమ్మక్కై రాష్ట్ర విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు.. ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆది నుంచి పావులు కదుపుతూ వచ్చాయి. రాయలసీమను నిట్టనిలువున చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చాలని కుట్రపన్నాయి. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతను రైల్వేశాఖ సహాయ మంత్రి, కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అప్పగించారు.
ఆ మేరకు ఆగస్టు 5న కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామిలతో కలిసి సోనియాను కోట్ల కలిశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను సీమ నుంచి చీల్చి తెలంగాణలో కలిపి.. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి తనను కలిసే బాధ్యతను సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి అప్పట్లోనే సోనియా అప్పగించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో ‘రాయల తెలంగానం’ చేయించే బాధ్యతను తాను సమైక్యవాదిగానే ప్రకటించుకునే ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేకు చంద్రబాబు అప్పగించారు. కానీ.. కోట్ల ప్రతిపాదనపై సీమలో, ప్రధానంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్ధృతి కాస్త తగ్గిందని కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ రాయల తెలంగాణను తెరపైకి తెచ్చింది. సోనియా కనుసైగల మేరకు జేసీ దివాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు.
మంగళవారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డిలతో రాయల తెలంగాణకు మద్దతుగా సంతకాలు సేకరించి.. అధిష్టానానికి పంపారు. మిగతా ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరహాలోనే ప్రతినిధి బృందంతో కలిసి సోనియాతో సమావేశమయ్యేందుకు జేసీ దివాకర్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో రాయల తెలంగాణకు అనుకూలంగా రహస్యంగా సంతకాలు సేకరిస్తోన్న ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే.. వాటిని జీవోఎంకు పంపడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ కుట్ర గుట్టు బహిర్గతం కాకుండా చూసేందుకు సమైక్యాంధ్రగానం వడిని మరింత పెంచి విన్పిస్తున్నారు.
ముందే రచించిన ప్రణాళిక మేరకు ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో తనపై విమర్శలు చేయించుకుంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సమైక్యవాదుల కన్నుగప్పేయత్నం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే విమర్శిస్తున్నారు. అధిష్టానాల ఆదేశాల మేరకు రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ కోట్ల, జేసీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నేతృత్వంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు జీవోఎంను కలిసి తమ వాదనను విన్పించడానికి సిద్ధమయ్యారని ఇరు పక్షాల నేతలూ అంగీకరిస్తుండటం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచే కాంగ్రెస్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేల వైఖరిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు.
మళ్లీ తెరపైకి రాయల తెలంగానం
Published Thu, Nov 7 2013 3:22 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement