చెన్నైలోని ఆంధ్రా హోటళ్లపై దాడి
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ నేపథ్యంలో చెన్నై అంబాలి నగర్లోని ఆంధ్ర హోటళ్లపై ఆదివారం ఆగంతకులు దాడులు చేశారు. ఈ దాడిలో నాలుగు హోటళ్లు పూర్తిగా ధ్వంసమైనాయి. దాంతో హోటల్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆంధ్ర - తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత ఆదివారం కూడా కొనసాగుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.
తమిళనాడు వైపునకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లాలో పండిన టమోట పంటను రైతులు చెన్నై నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే చెన్నైకు రవాణ సౌకర్యం లేకపోవడంతో టమోట రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో గత మంగళవారం పోలీసుల ఎన్ కౌంటర్ లో చెన్నైకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమిళనాడు వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంస్థలు, ఆస్తులపై దాడులు చేస్తామని వారు హెచ్చరించిన సంగతి తెలిసిందే.