సాక్షి, చెన్నై: ఎర్ర చందనం స్మగ్లింగ్ పేరిట తమిళనాడుకు చెందిన ఎందరో అభాగ్యులు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నిర్భందంలో ఉన్నారని ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పరిశీలన, విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. అయితే, ఇదే రకమైన కేసు సుప్రీం కోర్టులో ఉన్న దృష్ట్యా, విచారణ జూన్ మూడో తేదీకి వాయిదా పడింది. చిత్తూరు జిల్లా శేషా చలంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకం అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్ల దాఖలు పెరుగుతున్నది. మద్రాసు హైకోర్టుకు వచ్చే పిటిషన్లను పరిశీలిస్తున్న న్యాయ స్థానం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించే పనిలో న్యాయమూర్తులు నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వ్యతిరేకంగా ఓ కొత్త రకం పిటిషన్ మద్రాసు హైకోర్టులో దాఖలు అయింది.
చెన్నై వ్యాసార్పాడికి చెందిన తంగం ఉదయం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ పేరిట ఎందరో నిర్దోషులు, అభాగ్యులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమిళనాడుకు వచ్చి మరీ అరెస్టు చేసి ఉన్నారని తన పిటిషన్‌లో వివరించారు. జనవరిలో తన సోదరుడు రవిని చడీ చప్పుడు కాకుండా అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు మూడు రోజుల అనంతరం అతడి మీద ఎర్ర చందనం స్మగ్లర్ అన్న ముద్ర ను వేశారని పేర్కొన్నారు. చెన్నైకు చెందిన మహ్మద్ రఫీని తీసుకు వెళ్లి విచారణ పేరిట వేధించారని, అతడి కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో స్మగ్లర్ అన్న ముద్రను వేసి న్యాయ స్థానం ముందుకు తీసుకొచ్చారని వివరించారు. ఇలా తమిళనాడుకు చెందిన ఎందరో యువకులు ఆంధ్రా జైళ్లల్లో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పులు చేసిన వాళ్లు శిక్షార్హులైనప్పటికీ, ఏ తప్పు చేయని తన సోదరుడు లాంటి వాళ్లు ఎందరో ఆంధ్రా పోలీసుల నిర్బంధంలో ఉన్నారని, దీనిపై పరిశీలన, విచారణ జరిపించి తమిళ యువకులకు న్యాయం చేయాలని కోరారు. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రంలోకి వచ్చి ఎవర్నైనా అరెస్టు చేయాల్సి ఉంటే,
ఆయా ప్రాంత పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉందని, అయితే, ఆంధ్రా పోలీసులు మాత్రం అలా వ్యవహరించడం లేదని, నిబంధనల్ని ఉల్లంఘించి మరీ అరెస్టులు చేసి తీసుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అరెస్టుల్ని తీవ్రంగా పరిగణించి నిబంధనలు కఠినత్వం చేసే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని, ఆంధ్రా నిర్బంధంలో ఎంత మంది ఉన్నారో పరిశీలించి నివేదిక సమర్పణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి శివజ్ఞానం నేతృత్వంలో బెంచ్ విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తిరుమారన్ హాజరై వాదన విన్పించారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయ స్థానం ఇదే రకమైన ఓ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో ఉందని పేర్కొంటూ, తాజా పిటిషన్ విచారణను జూన్ మూడో తేదీకి వాయిదా వేశారు.
ఎర్ర చందనం పట్టి వేత : ఆంధ్రా పోలీసులు సెంగుండ్రం వద్ద రూ.60 లక్షలు విలువ చేసే ఒక టన్ను ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు నుంచి వచ్చిన ఓ పోలీసు బృందం సెంగుండ్రం(రెడ్ హిల్స్) సమీపంలోని ఎడపాళయం జీవానగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు గోడౌన్లో తనిఖీలు నిర్వహించి ఎర్ర చందనం స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఆ గోడౌన్ వాచ్ మెన్ నెల్లూరుకు చెందిన కర్ణను తీసుకుని వెళ్లినట్టు స్థానిక పోలీసులకు ఆ పరిసర వాసులు ఫిర్యాదు చేసి ఉన్నారు.
అభాగ్యుల నిర్బంధం
Published Tue, Apr 21 2015 1:58 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement