ఏపీలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో బుధవారం కూడా రాష్ట్రం అట్టుడికిపోయింది. ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు, పలు పార్టీల నేతలు ర్యాలీలు, రాస్తారోకోలతో ఆందోళనలు నిర్వహించారు. ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. అయితే పరిస్థితులు చేయిదాటకుండా వందలాది మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: కూలీలు దాడులకు దిగడం వల్లనే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఏపీ పోలీసులు చెబుతున్నా ప్రజాసంఘాలు, తమిళ పార్టీలు ఎంతమాత్రం వాటిని నమ్మడం లేదు. కూలీల చేతుల్ని కట్టేసి కాల్చినట్లు ఆధారాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరగడానికి ముందు రోజు సోమవారం రాత్రి ఏడుగురు కూలీలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తిరువణ్నామలైకి చేరుకున్న కూలీ శేఖర్ చెప్పాడు. మరుసటి రోజు జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల్లో ఆ ఏడుగురు ఉండడంతో కూలీలను ఉద్దేశ పూర్వకంగానే కాల్చి చంపినట్లు వారు నిర్ధారిస్తున్నారు.
తెలుగు ప్రజలూ జాగ్రత్త: నామ్‌తమిళర్ కట్చి నేతలు చెన్నైలోని ఆంధ్రాక్లబ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ‘నిన్న శ్రీలంక-నేడు ఆంధ్రప్రదేశ్’ అంటూ ప్లకార్డులు, ‘ఏపీ ప్రభుత్వాన్ని వదలబోం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేయడానికి ఆందోళనకారులు ప్రయత్నించగా దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిషన్‌ను నియమించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామ్‌తమిళర్ కట్చి నాయకుడు అన్బుతెన్నరసన్ మాట్లాడుతూ.. ఇదేమన్నా పాకిస్తానా, పొట్టకూటికోసం పక్క రాష్ట్రానికి వెళితే కాల్చిచంపుతారా? అంటూ ప్రశ్నించారు. ఏపీలోని కొందరు బడానేతలను కాపాడేందుకు అమాయక తమిళ కూలీలను కాల్చిచంపారని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామ్‌తమిళర్ కట్చి ఆస్కాను ముట్టడించడానికి వస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మృతదేహాలు మాకవసరం లేదు: ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన కూలీల మృతదేహాలను తాము స్వాధీనం చేసుకోబోమని మృతుల కుటుంబాలు వేలూరు జిల్లా కన్నమంగళం పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడి టీటీడీ సమాచార కేంద్రం వద్ద ఆందోళనకు దిగి, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు నిప్పంటించారు. మరోవైపు ఆంధ్రా బస్సులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టారు. విళుపురం జిల్లాలోని 40 గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడే రాస్తారోకోలు నిర్వహించారు. రైలు ముట్టడికి యత్నించిన వీసీకే నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చీ-తంజావూరు మధ్యనున్న టోల్‌గేట్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేసి, తిరుచ్చీ హైవేపై రాస్తారోకోకు దిగారు. ఆరంబాకం వద్ద ఒక బస్సు అద్దాలను పగులగొట్టారు. తమిళనాడు నుంచి ఏపీవైపు వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు.
అట్టుడికిన రాష్ట్రం
Published Thu, Apr 9 2015 2:30 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement
Advertisement