మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ముందంజలో ఉంది. వార్డు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాళహస్తి, పుత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది.
నగరిలో వార్డులకు బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రోజాతోపాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ కూడా చైర్మన్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.
శ్రీకాళహస్తిలో మిద్దెల హరిని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ పలు వార్డుల్లో నామినేషన్లు వేశారు. అన్ని వార్డుల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. నాలుగో వార్డు అభ్యర్థిగా మిద్దెలహరి బరిలో ఉన్నారు. పుత్తూరులో డీఎన్ ఏలుమలై (అమ్ములు) 22వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిచే వారిలో ఏలుమలై ఒకరని అక్కడి ఓటర్లు చెబుతున్నారు. పలమనేరులో సీవీ కుమార్ భార్య శారద వైఎస్‌ఆర్ సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఈమెను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పుంగనూరు, మదనపల్లె మున్సిపాలిటీల్లో వార్డులకు వైఎస్‌ఆర్‌సీపీ తర ఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారంలోనూ వీరు ముందున్నారు. జిల్లావ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని మున్సిపాలిటీల్లో నాయకులను కోరుతున్నారు. ఇప్పటికే అన్ని వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసినందున నామినేషన్ వేయకుండానే కొం దరు ప్రచారంలో పాల్గొనగా, నామినేషన్ వేసి కొంద రు ప్రచారంలో ముందున్నారు. కొందరు మంచిరో జు చూసి నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
చిత్తూరు కార్పొరేషన్ మేయర్‌గా..
చిత్తూరు కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ఇక్కడ తమిళ్ నాయకర్ సామాజిక వర్గానికి చెందిన వారిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపుతామని వైఎస్‌ఆర్ సీపీ అధిష్టానం ప్రకటించింది. ఆ మేరకు చిత్తూరు ప్రజలు వైఎస్‌ఆర్ చేసిన సేవలు గుర్తుకు తెచ్చుకుని పార్టీని గెలిపించాలని నాయకులు ప్రచారం ప్రారంభించారు.
చైర్మన్ అభ్యర్థులను ప్రకటించుకోలేని టీడీపీ
తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు వార్డులకు నామినేషన్లు దాఖలు చేసినా చైర్మన్ అభ్యర్థి ఎవరనే విష యం ప్రకటించలేదు. చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే కొం దరు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని, పార్టీలో ముఖ్య నాయకులు చెబితే వినే పరిస్థితుల్లో మున్సిపల్ నాయకత్వం లేదని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబు నాయకత్వంలోని పార్టీలోని వారికి ఓటడిగే హక్కులేదని పలువురు ఓటర్లు ముఖాన్నే చెబుతున్నారని, అయినా పార్టీలో ఉన్నాం కాబట్టి పోటీ చేస్తున్నామని పలువురు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క మున్సిపాలిటీకి కూడా చైర్మన్ అభ్యర్థిని టీడీపీ ప్రకటించలేదు.
కాంగ్రెస్ కనుమరుగు
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులే కనిపించడం లేదు. ఒకవేళ ఎవరైనా సొంతంగా నామినేషన్ వేసి తాను కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశానని చెబితే బీ ఫారం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. పుంగనూరులో ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున ఒక్క నామినేషన్‌కూడా దాఖలు కాలేదు. మదనపల్లెలో ఒకరు మాత్రమే నామినేషన్ వేశారు. పలమనేరులోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. శ్రీకాళహస్తిలో నలుగురు నామినేషన్లు వేశారు. ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ కనిపించే అవకాశం లేదు. ఎవరైనా పార్టీపై అభిమానంతో నామినేషన్ వేసినా వారికి ఓటేసేవారు లేరని ప్రజలు అంటున్నారు.