ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లు రావణవాహనాధీశులై కనిపించారు.
రావణవాహనాధీశుడైన మల్లన్న
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లు రావణవాహనాధీశులై కనిపించారు. ప్రాతఃకాలపూజలనంతరం గర్భాలయముఖమండపంలోని ఉత్తరద్వారం ఎదురుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం 6.30గంటలకు రావణవాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. ఆలయప్రదక్షిణతో ఊరేగింపుగా శ్రీకృష్ణదేవరాయగోపురం గుండా ప్రధాన రథవీధికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం వరకు సాగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన వందలాది మంది భక్తులు రావణవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించుకొన్నారు. కార్యక్రమంలో ఈఓ చంద్రశేఖర ఆజాద్‌తో పాటు ఏఈఓ రాజశేఖర్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. శనివారం శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను 80వేలకు పైగా భక్తులు దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహామంగళహారతులు జరిగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు పాతాళగంగలో పవిత్రస్నానాలు చేసిస్వామిఅమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. దీంతో ఉచిత, ప్రత్యేక,అతిశీఘ్ర దర్శన క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోనికి అనుమతించేలా చర్యలు తీసుకున్నారు.
- న్యూస్‌లైన్, శ్రీశైలం
నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు ఏడు రోజుల పాటు మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆదివారం ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, చండీశ్వరపూజ, కంకణధారణ, కలశస్థాపన ఉంటాయన్నారు. అదేరోజు సాయంత్రం 5.30గంటలకు అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణలు చేస్తారన్నారు. 13వ తేదీ నుంచి 17 వరకు ప్రతి రోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, జపానుష్ఠానమలు, నిత్యహవనాలు, రుద్రహోమాలను నిర్వహిస్తారన్నారు. 15న మకర సంక్రాంతి రోజున రాత్రి 8గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, 16న సదస్యం, నాగవల్లి పూజలు చేస్తారన్నారు.
17న ఉదయం 9.45గంటలకు రుద్రయాగ, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, వసంతోత్సవం, ధ్వజావరోహణ కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. 18న స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవ, శయనోత్సవపూజలను చేస్తారన్నారు. మల్లికార్జునస్వామివారికి ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు కల్యాణోత్సవం జరుగుతుందని, మకర సంక్రాంతిన మాత్రమే పార్వతీ సమేత మల్లికార్జునస్వామికి కల్యాణోత్సవం జరిపించడం విశేషంగా పేర్కొన్నారు.
- న్యూస్‌లైన్, శ్రీశైలం
కోదండరాముడికి
లక్ష పుష్పార్చన
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ సీతాసమేత శ్రీ కోదండరాముల వారికి లక్షపుష్పార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. డీసీ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేదపండితులు రాధాకృష్ణశర్మ, రవిశంకరఅవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, శాంతారాంభట్ తదితర పండిత బృందం వేకువజాము నుంచి విశేష పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులకు తిరుమంజనం, స్వామివారికి ఉత్తరద్వారంలో విశేష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన లక్షపుష్పార్చన పూజల్లో భక్తులు పాల్గొని పూలసేవల్లో తరించారు. ఆలయ అర్చకులు జనార్దనశర్మ, కొమ్మద్ది శంకరయ్య తదితరులు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. కార్యక్రమాలకు పోచాబ్రహ్మనందరెడ్డి, శేషశయనారెడ్డి దంపతులు ఆర్థిక సహాకారం అందించినట్లు వారు వివరించారు. మహానంది క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపట్టిన ఏడుకొండలవాడి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
- న్యూస్‌లైన్, మహానంది