అన్నవరం, న్యూస్‌లైన్ : రత్నగిరిపై శ్రీసత్యదేవుని సన్నిధిలో శ్రావణ మాసం రెండో శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పర్వదినం నాడు సామూహిక వరలక్ష్మి పూజ ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన 900 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పూజ అచరించారు. స్వామివారి నిత్యకల్యాణమండపంలో సామూహిక వరలక్ష్మి పూజ నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు దేవస్థానం ఈఓ పి. వేంకటేశ్వర్లు దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత పండితులు విఘ్నేశ్వరపూజ నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేశారు. వేదపండితుల వేదస్వస్తితో వరలక్ష్మీ పూజ ప్రారంభమైంది. వరలక్ష్మీ అమ్మవారికి పండితులు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజ చేశారు.
పూజలో పాల్గొన్న మహిళలతో కూడా పూజ చేయించి వ్రతకథను చదివి వినిపించారు. చివరలో వరలక్ష్మీ అమ్మవారికి , సత్యదేవుడు, అమ్మవార్లకు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థానం వేదపండితులు ముష్టి కామశాస్త్రి, గొర్తి సుభ్రహ్మణ్య ఘనాపాటీ, అర్చకులు ఇంద్రగంటి బుల్లి, కోట శ్రీనువాస్, వ్రతపురోహిత ప్రముఖులు ముత్య సత్యనారాయణ, తదితరులు ఈకార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న మహిళలు కొబ్బరికాయ, అరిటిపళ్లు, పూవులు మాత్రం తెచ్చుకోగా, పసుపు, కుంకుమ, హారతికర్పూరం, అగరువత్తులు, గావంచా, పత్రి, అక్షింతలు, తమలపాకులు దేవస్థానమే సమకూర్చింది. వరలక్ష్మి రాగి రూపు, జాకెట్టుముక్క, తోరం, సత్యదేవుని ప్రసాదం 100 గ్రాముల ప్యాకెట్ వారికి అందచేశారు. పూజ అనంతరం మహిళలందరూ సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. వీరికి అన్నదానపథకంలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, సూపపరింటెండెంట్ నరసింహారావు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.
రత్నగిరిపై వరలక్ష్మీ వ్రత శోభ
Published Sat, Aug 17 2013 12:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement