రంగా హత్య వెనుక దేవినేని ఉమా హస్తం | Vasantha nageswararao commented over devineni uma | Sakshi
Sakshi News home page

రంగా హత్య వెనుక దేవినేని ఉమా హస్తం

Published Sat, Jun 9 2018 2:32 AM | Last Updated on Sat, Jun 9 2018 9:32 AM

Vasantha nageswararao commented over devineni uma - Sakshi

కంచికచర్ల(నందిగామ): వంగవీటి మోహన్‌ రంగా హత్యకేసులో మొదటి ముద్దాయి దేవినేని కుటుంబమేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలోని తన స్వగృహంలో వసంత శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి దేవినేని ఉమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత అన్న వెంకటరమణ అయ్యప్పమాలలో ఉండి వంగవీటి మోహన్‌రంగాను హత్య చేశాడని, ఆ హత్య వెనుకాల ఉమామహేశ్వరరావు హస్తముందని ఆయన అన్నారు.

నిత్యం అబద్ధాలాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పట్టిసీమ పేరుతో తన అనుచరులతో కలిచి కోట్లు దోచుకున్న ఘనత ఉమామహేశ్వరరావుదేనని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధికోసం సొంత అన్న దేవినేని వెంకటరమణ భార్యను మానసిక ఒత్తిడికి గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యాడని, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడని దేవినేని ఉమాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అంతేగాక ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్‌(కేపీ) టీడీపీలో ఉండగా నాలుగేళ్లపాటు ఉమా కలిసి ఉన్నాడని, ఇప్పుడు కేపీ పార్టీ మారిన తర్వాత విమర్శలు చేయడం సబబు కాదన్నారు. తాను చిన్నతనం నుంచే రాజకీయాల్లో ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి అవినీతి, మచ్చ లేకుండా ప్రజలతో మమేకమై ఉన్నానన్నారు. ఏడాదిలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందని, మైలవరంలో దేవినేని ఉమాను ఓడించేందుకు తమ వంతు కృషిచేస్తామని వసంత పేర్కొన్నారు. సమావేశంలో మాగంటి వెంకటరామారావు, అబ్బూరి మల్లేశ్వరరావు, తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement