దేవినేని ఉమా అనుచరులను నమ్మని వసంత వర్గం
క్షోభతో రగిలిపోతున్న ఉమ వర్గం టీడీపీ నాయకులు
వారిపై నిఘా ఉంచి అనుక్షణం గమనిస్తున్న వసంత
కష్టం తమది, పెత్తనం కృష్ణప్రసాద్ ఉద్యోగులదని టీడీపీ కేడర్ ఆగ్రహం
జి.కొండూరు: వారిద్దరూ ఐదేళ్లుగా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. సభ్యత మరిచి నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీ నాయకుల య్యారు. వారే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ ఇద్దరూ ఇప్పుడు చేతులు కలిపారు. తమ వర్గం నాయకులను కూడా కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వసంత నామినేషన్ కార్యక్రమంలోనూ కలసి చేతులు ఊపారు. అందరం కలసి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తామంటూ గొప్పలు చెప్పారు. ఇదంతా పైకి కనిపిస్తున్న వ్యవహారం. అంతర్గతంగా మాత్రం రెండు వర్గాలు కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. కలసి పనిచేయడం అన్న మాట అటుంచి ఒకరిపై మరొకరు నమ్మకమే ఉంచలేకపోతున్నారు.
వెంటాడుతున్న వెన్నుపోటు భయం
మైలవరం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి వసంత వెంకటకృష్ణప్రసాద్, టీడీపీ నుంచి దేవినేని ఉమా పోటీ చేశారు. ఉమా ఓటమిపాలవగా వసంత ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత ఎన్నికలు వచ్చేసరికి వసంత కృష్ణప్రసాద్ టీడీపీ గూటికి చేరారు. అతను టీడీపీలో చేరడాన్ని, ఎమ్మెల్యే టికెట్ పొందడాన్ని దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతర పరిణామాల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారిద్దరూ చేతులు కలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఉమా వర్గం, వసంత వర్గం కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. ఉమా వర్గాన్ని వసంత వర్గమే కాదు టీడీపీ కేడర్ కూడా నమ్మలేకపోతోందని సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు కలసి పనిచేస్తున్నట్లు నటిస్తున్నా ఓటు వేసే సమయానికి ఉమా వర్గీయులు వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం వసంతను వెంటాడుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఉమా వర్గీయులపై నిఘా
ఉమా వర్గీయులపై నమ్మకం ఉంచలేని వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల్లో పని చేసే రెండు వేల మంది ఉద్యోగులను రంగంలోకి దింపారు. వారితో ఉమా వర్గంపై నిఘా ఉంచారని, అంతటితో ఆగకుండా ప్రచారం నుంచి డబ్బు పంపిణీ వరకు అన్ని పనులు ఆ ఉద్యోగులే చక్కబెట్టేందుకు సిద్ధమ య్యారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వసంత తీరును జీర్ణించుకోలేని ఉమా వర్గీయులు అతనితో కలిసి పనిచేయలేమని తమ నాయకుడి వద్ద వాపోతున్నారని సమాచారం.
మళ్లీ ఇన్‌చార్జులే దిక్కా?
వసంత వెంకటకృష్ణప్రసాద్ స్థానికుడు కాదు. వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. దీంతో మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అస్తిత్వం గందరగోళంలో పడింది. ఒక వైపు ఉమా వర్గీయులు, మరో వైపు ఆయన వ్యతిరేకులు, ఇంకో వైపు వైఎస్సార్ సీపీ నుంచి వసంతతోపాటు టీడీపీలో చేరిన చిన్నాచితకా నాయకుల వర్గంగా టీడీపీ విడిపోయింది. ఈ మూడు వర్గాల పోరుతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో తెలియక, ఎవరికి బాధ్యతలు ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనన్న భయంతో వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల నుంచి ఉద్యోగులను దింపి పెత్తనమంతా వారికే అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వసంత, స్థానికులను కాదని మండలానికి ఒక ఇన్‌చార్జ్‌ని నియమించి పార్టీలో వర్గ పోరుకు కారణమయ్యారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో వసంత తీరును చూసిన టీడీపీ కేడర్, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మళ్లీ ఇన్‌చార్జులతోనే పాలన చేస్తాడేమోనని ఆందోళనచెందుతోంది.
మద్యం కేసులో ఉమా వర్గీయులు
‘సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు కష్టం మాది, కేసులు మాకు, పెత్తనం మీకా?’ అంటూ ఉమా వర్గీయులు కుమిలిపోతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెలంగాణ నుంచి భారీగా మద్యం తరలిస్తూ పట్టుబడిన చేబ్రోలు రాజు, మరో నలుగురు నిందితులు సైతం ఉమా వర్గానికి చెందిన నాయకులే. పట్టుబడిన మద్యంతో తనకు ఎటువంటి సంబంధంలేదని వసంత తప్పుకోవడంతో ఉమా వర్గీయులు మరింత ఆవేదన చెందుతున్నారని సమాచారం. కావాలనే మద్యం రవాణా, పంపిణీ వంటి అసాంఘిక కార్యకాలపాలను తమకు అప్పజెప్పి పెత్తనం మాత్రం వసంత అనుచరులు, ఆయన కంపెనీల ఉద్యోగులు చేస్తున్నారని ఉమా వర్గీయులు రగిలిపోతున్నారు. ఐదేళ్లు తమ నాయకుడికి జరిగిన అవమానంతో పాటు తమకు నియోజకవర్గంలో ఎదురవుతున్న క్షోభకు తగిన బుద్దిచెప్పాలని ఉమా వర్గీయుల్లో చర్చ జరుగుతోందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment