నవాబుపేట, న్యూస్‌లైన్: తీవ్ర ఉద్రిక్తతల మధ్య బుధవారం వట్టిమీనపల్లి పీఏసీఎస్‌కు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డులకుగాను ఇప్పటికే ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 8 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగిం ది. ఎనిమిది వార్డుల్లో మొత్తం 1,974 ఓట్లుం డగా 1,470 పోలయ్యాయి. 74శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి గంటలో ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్ మద్దతుదారులు 4, టీడీపీ మద్దతుదారులు 3, టీఆర్‌ఎస్ మద్దతుదారులు 1 వార్డు దక్కించుకున్నారు. ఏకగ్రీవమైన వాటిని కలుపుకుంటే మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులకు 8, టీడీపీ మద్దతుదారులకు 3, టీఆర్‌ఎస్ మద్దతుదారులకు 2 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్‌లోని కాలె యాదయ్య వర్గానికి 3, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి 5 వార్డులు దక్కాయి.
ఎన్నికైన వార్డు సభ్యులు వీరే...
1వ వార్డు: మాణిక్‌రెడ్డి, 2వ వార్డు: కె.కొండ య్య, 3వ వార్డు : ఆగంరెడ్డి, 4వ వార్డు : ఎల్.ప్రమూకమ్మ, 5వ వార్డు : ఎల్.మాణిక్‌రెడ్డి, 6వ వార్డు : కె.మాణిక్‌రెడ్డి, 7వ వార్డు : జనార్దన్‌రెడ్డి, 8వ వార్డు : ఎం.మల్లారెడ్డి, 9వ వార్డు : పూల్‌సింగ్, 10వ వార్డు :ప్రభు, 11వ వార్డు: మాణెయ్య , 12వ వార్డు : వెంకటమ్మ, 13వ వార్డు : పి.రాంరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తకీహుస్సేన్ తెలిపారు. గురువారం చైర్మన్, ఉప చైర్మన్‌తో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు.
ఉద్రిక్తత...
కాగా, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇక్కడ కాలె యాదయ్య, చిట్టెపు మల్లారెడ్డి రెండు వర్గాలు ఉన్నాయి. వీరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. బుధవారం ఓటింగ్ జరుగుతుండగా ఇరువర్గాల నాయకులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మల్లారెడ్డి వర్గానికి చెందిన ఓ అభ్యర్థిని యాదయ్య వర్గీయులు తీసుకుపోయారంటూ గొడవ మొదలైంది. ఆగ్రహించిన మల్లారెడ్డి వర్గీయులు యాదయ్య వర్గానికి చెందిన అభ్యర్థిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
భారీ బందోబస్తు..
వికారాబాద్ డీఎస్పీ నర్సింలు, శిక్షణ డీఎస్పీ హ ర్ష, సీఐలు విజయ్‌లాల, లచ్చిరాం, ఎస్‌ఐలు చతుర్వేది, భీంకుమార్, శిక్షణ ఎస్‌ఐలు వెంకటేశ్వర్‌గౌడ్,అరుణ్‌కుమార్,శంషొద్దీన్,రమేష్, 60 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
సందిగ్ధంలో చైర్మన్ ఎన్నిక ..
కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలతో చైర్మన్ ఎన్నిక సందిగ్ధంలో పడింది. రెండు వర్గాలు ఏకమై చైర్మన్‌ను ఎన్నుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక టీడీపీకీ, టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయి స్థానా లు దక్కలేదు. దీంతో కాంగ్రెస్‌లోని ఓ వర్గానికి టీడీపీ, మరో వర్గానికి టీఆర్‌ఎస్ మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసు ..
ఎన్నికల నిబంధన లు ఉల్లంఘించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ -2 వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. బుధవారం 11 గంటల సమయంలో మండల పరిధిలోని వట్టిమీనపల్లి పీఏసీఎస్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెపు మల్లారెడ్డి వర్గీయులు, కాలె యాదయ్య వర్గీయులు పరస్పరం గొడవపడి ఓటర్లకు ఇబ్బంది కలిగించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన రెండు వర్గాలకు చెందిన పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ ఖాతాలో వట్టిమీనపల్లి సొసైటీ
Published Thu, Dec 19 2013 1:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement