
ఇదీ పింఛన్ల సంగతి !
- ఒక్క కుటుంబంలో ఒక్కరికే పింఛన్.. తక్కినవన్నీ తొలగింపు!
- సర్కారు చేపడుతున్న తనిఖీల అంతరార్థం ఇదే!
- వీలైనంత వరకూ పింఛన్లను తగ్గించాలని అధికారులు, టీడీపీ నేతలకు ఆదేశాలు
- తనిఖీలకు నేడు.. కొత్త పింఛన్లకు రేపు ఆఖరి గడువు
- కొత్త, పాత పింఛన్‌దారులకు వచ్చేనెల 2న డబ్బులు అందడం డౌటే!
సాక్షి, చిత్తూరు: పీలేరు పట్టణంలోని మాబున్నీసా(పేరుమార్చాం) వయసు 70 ఏళ్లు. నాలుగేళ్ల కిందట కొడుకు చనిపోవడంతో కోడలు ఎలాంటి ఆసరా లేకుండా జీవిస్తోంది. అలాగే మాబున్నీసా మరో కుమారుడు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. దీంతో ఈ ఇంట్లో సంపాదన కోసం కష్టపడేవారు ఎవరూ లేరు. ఈ కుటుంబానికి ఓ వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛను రావాలి. అయితే చంద్రబాబు సర్కారు ఇందుకు ససేమిరా అంటోంది. ఇంట్లో ఏదేని ఒక్క పింఛను ఇచ్చి తక్కిన రెండింటినీ తొలగిస్తోంది. తనిఖీల్లో ఈ విషయం టీడీపీ నేతలు స్పష్టం చేయడంతో ఇంటిల్లిపాది బోరుమంటున్నారు.
ప్రస్తుతం రెండు రోజులుగా జిల్లాలో పింఛన్‌దారుల తనిఖీ పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు చేస్తున్న ఘనకార్యానికి ఉదాహరణ పీలేరు మాబున్నీసా కుటుంబవేదన. పింఛను డబ్బులుపెంచుతాం.. అర్హులైన అందరికీ పింఛన్లు ఇస్తామని చంద్రబాబు చేసిన హామీలు నీటిమూటలని తేలిపోయింది. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న పింఛనుదారుల తనిఖీల్లో ఈ విషయం సుస్పష్టమవుతోంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛను అంటూ అర్హులైన వారి పేర్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దీంతో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు అర్హులు ఉన్నప్పటికీ పింఛను రాక బోరుమంటున్నారు. దీంతో 2004 ముందు పరిస్థితులు పునావృతమవుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నెల 19న పింఛను తీసుకుంటున్నవారు అర్హులా? కాదా? అని తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 19వ తేదీ తనిఖీలకు సిద్ధపడింది. దీంతో పనులకోసం వలసలు వెళ్లిన కొంతమంది పేదలు కుటుంబసభ్యుల సమాచారం మేరకు హుటాహుటిన గ్రామాలకు వచ్చారు. చాలామంది సమాచారం లేక రాలేకపోయారు. సర్కారు అనుకున్నట్లుగానే శుక్రవారం మధ్యాహ్నం వరకూ తనిఖీలు నిర్వహించారు. ఉన్నఫళంగా తనిఖీలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాతి తేదీ వెల్లడించలేదు. దీంతో లబ్ధిదారులు తిరిగి వారి పనులకు వెళ్లారు. ఆదివారం తనిఖీల నిర్వహణ చేపట్టారు. దీనికి ప్రజలకు సమాచారం లేదు. ఆది, సోమ రెండురోజులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ తనిఖీలకు గడువిచ్చారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఇవ్వడానికి బుధవారం ఆఖరుగా నిర్ణయించారు.
అంతా.. వారి ఇష్టానుసారమే!
ప్రస్తుతం జరుగుతున్న తనిఖీల్లో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. టీడీపీ నేతలు చెప్పినట్లు తలూపడం, రికార్డులో పేర్లు చేర్చడం, తొలగించడం మినహా న్యాయబద్ధంగా సర్వే నిర్వహించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛను అంటూ అసలైన లబ్ధిదారులు ఉన్నా వారి పేర్లను తొలగిస్తున్నారు. ఇదేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తే! ‘వెయ్యి రూపాయలు ఇస్తున్నాం. ఎంతమందికి ఇవ్వాలి? ఇంత డబ్బు ఒకరికి ఇవ్వడమే గొప్ప!’ అంటూ బాహాటంగానే నిష్టూరమాడుతున్నారు. దీంతో మంచి చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే.. కొత్త పింఛన్ సంగతి దేవుడెరుగు ఉన్న పింఛను తీసేస్తున్నారంటీ? అంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
సగానికి తగ్గించడమే లక్ష్యం
జిల్లాలో 4లక్షలమంది పింఛనుదారులకు ప్రతీనెలా 14 కోట్ల రూపాయలను పింఛన్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. వెయ్యిరూపాయలకు పింఛను పెంచినా ఉన్న డబ్బులే సరిపోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పింఛన్ల సంఖ్యను 2లక్షలకు పరిమితం చేసేలా అధికారులు, టీడీపీ నేతలు కోతల కార్యక్రమాన్ని చేపట్టారు.
రెండో తేదీ డబ్బులు అందడం డౌటే!
అక్టోబరు రెండు గాంధీ జయంతిని పురస్కరించుకుని పెంచిన పింఛను సొమ్ముతోపాటు అర్హత ఉండి పింఛన్లు అందనివారికి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈనెల 24, 25 వరకూ తనిఖీల తంతు తెగేలా లేదు. ఆపై తనిఖీల గడువును పెంచే అవకాశం ఉన్నట్లు కూడా అధికారవర్గాలు చెబుతాయి. ఈ క్రమంలో మార్పులు, చేర్పులు పూర్తయి కొత్త జాబితా సిద్ధమవ్వాలి. ఆ మేరకు డబ్బులు మంజూరు కావాలి. ఇవన్నీ పూర్తయి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. దీంతో వెయ్యి రూపాయల పింఛను తీసుకుంటామని ఆశపడిన లబ్ధిదారులు నిరాశకు గురికానున్నారు.
అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలి
అర్హులందరికీ సామాజిక పింఛన్లు ఇవ్వాలని చిత్తూరు జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు ధర్నా చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ అనే విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ఒక కుటుంబంలో ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది వికలాంగుల ధ్రువీకరణపత్రాలు పొందిన వారు చాలా మంది ఉన్నారని, వీరందరికీ పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. వికలాంగులకు అన్యాయంచేస్తే రాష్ర్ట వ్యాప్తంగా తాము ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. వికలాంగులకు పెన్షన్ తొలగించడం మానవహక్కుల ఉల్లంఘనగా భావిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మురళి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.