కౌలు రైతు కుదేలు !
పాలకొండ : అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి గందరగోళంగా మారింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. హుద్‌హుద్ తుపాను సృష్టించిన బీభత్సంతో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు నష్టపరిహారం అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం రెండు లక్షల మంది కౌలు రైతులున్నారని అంచనా. వీరంతా సామాన్య, భూస్వామ్య రైతుల వద్ద పొలాలను కౌలుకి తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన వచ్చిన హుద్‌హుద్ తుపాను పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. సరాసరి దిగుబడులు బాగా పడిపోయూరుు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వరి ఎకరాకు 15 నుంచి 19 బస్తాలకే పరిమితమైంది. ఇందులోనూ ధాన్యం బురద పట్టి పోవడంతో రంగుమారాయి. దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలో ఎకరాకు సరాసరి పొలం సొంతదారుకు 11 నుంచి 13 బస్తాల వరకు కౌలు రూపేణా చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన కౌలు రైతులు పండిన పం డంతా కౌలు కింద చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు చొప్పున పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు, రేషన్‌కార్డుల అనుసంధానంతో పరిహారం అందజేశారు. పాస్‌పుస్తకాలు ఉన్నవారి పేరునే పరిహారం అందజేయడంతో కౌలు రైతులు బిక్కుముఖం వేసుకున్నారు.
గుర్తింపు కార్డులు ఉంటే...
వాస్తవానికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉండి ఉంటే పరిహారం పొందేందుకు అవకాశముండేది. రైతుల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వం దీనిపై కనీస చర్యలు చేపట్టకపోవడంతో గుర్తింపు కార్డులు పొందిన రైతులు పదుల సంఖ్యలో మాత్రమే మిగిలారు. రెవె న్యూ, వ్యవసాయాధికారులుకౌలుదారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో ఆసక్తి కనబర్చలేదు. ప్రభుత్వం కూడా సహకరించకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
పైసా పరిహారం రాలేదు
మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. వరదలు ముంచి వేయడంతో ఎకరాకు పది బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.25 వేలు చొప్పున అయింది. రైతుకు కౌలు చెల్లిస్తే పైసా మిగలక తిరిగి అప్పు మిగిలింది. పరిహారం కూడా అందలేదు.
- గుమ్మిడి గురువులు, కౌలు రైతు, అంపిలి
ప్రభుత్వ నిర్లక్ష్యం
కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తుంది. గుర్తింపు కార్డుల కోసం పలుమార్లు ఆందోళన చేపట్టాం. అయినా కనీస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపలేదు. ఈ కారణంతోనే కౌలు రైతులు అప్పుల బారిన పడాల్సి వచ్చింది.
- బుడితి అప్పలనాయుడు, రైతు సంఘం నాయకుడు