అలమండ (జామి):హూద్‌హుద్ తుపాను ధాటికి నాశనమైన మామిడి తోటలపై రీ సర్వే చేపట్టాలని మామిడి రైతులు డిమాండ్ చేశార. అలమండ గ్రామంలో మామిడి రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు లగుడు సింహాద్రి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయి రైతుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, తుపాను ప్రభావం వల్ల మామిడి రైతులు ఎక్కువగా నష్టపోయారన్నారు. మామిడి, వరి, అరటి, తదితర రైతుల ఒక సంవత్సరం మాత్రమే నష్టపోతారని, అదే మామిడి రైతులతే సుమారు 20 సంవత్సరాల వరకు నష్టం భరించాల్సి ఉంటుందని చెప్పారు. తుపాను నష్టానికి సంబంధించి ఉద్యానవన శాఖాధికారులు చేపట్టిన సర్వే సక్రమంగా జరగలేదని ఆరోపించారు. తోటలకు సంబంధించి ప్రభుత్వ పరిహారంపై స్పష్టత లేదన్నారు.
మామిడి రైతులను ఆదుకోవాలని గతంలో లగుడు సింహాద్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. రైతులను ఆదుకునేంతవరకూ ఐకమత్యంతో పోరాడుదామని పిలుపునిచ్చారు. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తప్ప మిగిలిన ప్రజా ప్రతినిధులెవ్వరూ రైతుల గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, విశాఖ ఎంపీ హరిబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు మరోసారి వినతిపత్రాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు లగుడు దేముడు మాట్లాడుతూ, కౌలు రైతులు, తోట యజమానులు సఖ్యతగా ఉండాలని సూచించారు. కౌలురైతుకు, తోట యజమానికి మధ్య ఒప్పందం కుదిరేవరకు మూడో వ్యక్తి తోటలను కొనుగోలు చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. అలాగే రైతులకు రాయితీపై పురుగు మందులు, ఎరువులు అందజేయాలని కోరారు. అలాగే మామిడి రవాణాపై కూడా రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మామిడి సంఘం జిల్లా కార్యదర్శి సీతారామరాజు, నేతలు గోపాలరాజు, మోపాడ కృష్ణ, సాయి జగ్గారావు, లగుడు వెంకటరావు, బండారు వెంకటేశ్వరరావు, ఉద్యానవనశాఖాధికారి రమేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వే చేపట్టాలి
Published Sun, Dec 14 2014 2:06 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
Advertisement