ఈ గుడ్డు వెరీ స్మాల్‌ గురూ! | Very Small Egg | Sakshi
Sakshi News home page

ఈ గుడ్డు వెరీ స్మాల్‌ గురూ!

Published Sun, May 20 2018 8:37 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM

Very Small Egg  - Sakshi

చిన్నారులు... బాలింతలు... గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు నెలకొల్పిన అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. వాటిని కేంద్రాలకు సరఫరా చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే సరఫరా అవుతున్న కోడిగుడ్లు మరీ చిన్నవిగా ఉండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు విస్తుపోతున్నారు. రకరకాల సైజుల్లో వస్తున్న కోడిగుడ్లువల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు.

విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని గర్బిణులకు ప్రతీ నెల 16 గుడ్లు ఇస్తారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో 8 ఉడికించిన గుడ్లు ఇస్తారు. 3నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు వారానికి నాలుగు రోజులు ఉడికించిన గుడ్లు పెడతారు. అయితే కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు చాలా చిన్నసైజులో ఉంటున్నాయి. వీటి సరఫరా పేరుతో నిధులు గోల్‌మాల్‌ అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌ తనకు నచ్చిన రీతిలో వాటిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నెలకు 21 లక్షల వరకూ గుడ్లు సరఫరా
జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 2987 అంగన్‌వాడీ, 742 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో మూడేళ్లలోపు పిల్లలు 85,331మంది, 3 నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 47,074మంది, గర్భిణులు 22,457మంది, బాలింతలు 21,638 మంది ఉన్నారు. మొత్తం 1,76,500 మంది లబ్ధిదారులకోసం నెలకు 21,41,352 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇందులో మూడేళ్ల లోపు పిల్లలకు 6,82,648 గుడ్లు, 3ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు వారికి 7,53,184, గర్బిణులు, బాలింతలకు 7,05,520 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం నెలకు రూ.1,07,06,760 వరకు ఖర్చు చేస్తున్నారు.

35 నుంచి 40 గ్రాములే...
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్లు చాలావరకూ చిన్నవిగానే ఉంటున్నాయి. సాధారణంగా గుడ్డు బరువు 50 నుంచి 55 గ్రాములుంటుంది. కానీ ఈ కేంద్రాలకు సరఫరా అవుతున్నవి మాత్రం 35 గ్రాముల నుంచి 40 గ్రాములకు మించట్లేదు. పిల్లలకు అందించే గుడ్లు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నాణ్యమైన గుడ్లను సరఫరా చేయడం లేదనే ఆరోపణలు వినిస్తున్నాయి. చిన్న గుడ్లు సరఫరా చేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది.

ట్రే మొత్తం తూస్తే సరిపోతుంది
గుడ్డు చిన్నసైజులా కనిపిస్తున్నా... ట్రేలో ఉన్న 30 గుడ్లు బరువు తూస్తే సరిపోతుంది. సైజు చిన్నదిగా కనిపిస్తే నేను రెండు, మూడు కేంద్రాలను పరిశీలించి బరువు తూశాను. అప్పుడు నాకు ఈ విషయం స్పష్టమైంది.
– ఎం.శ్రీదేవి, సీడీపీఓ, విజయనగరం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement