‘చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ అమలుకాలేదు’
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చకపోవడంపై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య వాయిదా పడటమే కానీ పరిస్కారం కావడం లేదని బాధితులు చేపట్టిన బస్సు యాత్ర రామవరప్పాడు సెంటర్ చేరుకుంది. బస్సు యాత్రకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఘన స్వాగతం పలికారు. బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నా సీఎం చంద్రబాబు సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదన్నారు.
ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను అధికారికంగా లెక్కించడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర‍్యలు తీసుకోలేదని, సెప్టెంబర్ 16 లోగా స్పందించకుంటే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీపఘై జిల్లా నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపుడి శంకర్, మేధావుల సంఘం నేత చలసాని నివాస్ సంఘీభావం ప్రకటించారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 16 నుంచి నెల రోజులపాటు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైతన్య యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కొనసాగే ఈ యాత్ర నేటి సాయంత్రానికి రామవరప్పాడు సెంటర్ చేరుకుంది. బాధితులకు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, రూ. 5 లక్షలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన తరువాత కూడా 35 మందికి పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.