16 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర
Published Sat, Aug 12 2017 3:57 PM | Last Updated on Mon, Sep 11 2017 11:55 PM
విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్య వాయిదా పడుతుందే కానీ పరిస్కారం కావడం లేదని అగ్రిగోల్డ్ బాధితులు అన్నారు. బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వ న్యాయవాదులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలపై లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 16 నుంచి నెల రోజులపాటు అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది.
శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్నబాధితులకు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, రూ. 5 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిన తరువాత కూడా 35 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులందరికీ ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Advertisement
Advertisement