బాబును కలిసేందుకు విశాఖ నుంచి వచ్చి ఇక్కట్లపాలైన అంధుడు
హైదరాబాద్: సీఎం క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిథిగృహంలో వీడియో రికార్డింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాబుని కలిసేందుకొచ్చేవారిని చిత్రీకరించడం కోసం ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేశారు. ఇలా చిత్రించిన దృశ్యాల్ని టేపులుగా మార్చేందుకూ ఏర్పాట్లు చేశారు. ప్రతి శనివారం ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండే చంద్రబాబు ఈ శనివారం మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. చివరికి ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసులకు సైతం లేక్‌వ్యూ ప్రవేశంపై ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో సీఎంని కలిసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య ప్రజానీకం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఓ నిరుపేద అంధుడు సీఎంకు తన మొరవినిపించేందుకు ఉ. 9 గంటలకు రాగా సాయంత్రం 3 గంటలకు కలిసేలా చేస్తామని, అప్పటిదాకా బయట కూర్చోమని భద్రతా సిబ్బంది చెప్పారు. కానీ సాయంత్రం 5 గంటలవరకు నిరీక్షించినా ఫలితం దక్కలేదు. తనకు ఇంటిస్థలం లేదని, దానికోసం అంత దూరం నుంచి ఎంతో ఆశతో వచ్చానని, అయినా సీఎంను కలిసే అవకాశం దొరకలేదని అంధుడు వాపోయాడు. ఏపీ సచివాలయం, డీజీపీ కార్యాలయాలవద్దా ఇలాగేవీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు.
లేక్‌వ్యూ వద్ద వీడియో రికార్డింగ్
Published Sun, Jun 21 2015 9:30 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
Advertisement