మండపేట, న్యూస్‌లైన్ :
మండపేట, పరిసర గ్రామాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమ నిల్వలు బయటపడ్డాయి. రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో సుమారు రూ. 4.81 కోట్ల విలువైన సరుకులను సీజ్ చేశారు. మిల్లుల నిర్వాహకులపై కేసులు నమోదుచేశారు. విజిలెన్స్ ఎస్పీ పి.రమేషయ్యా ఆధ్వర్యంలో డీఎస్పీ రామచంద్రరావు, సీఐలు, ఇతర సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి మండపేటలోని జానకిరామ, అరవింద్ ఆగ్రోస్, మోదుకూరు సమీపంలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు, ఏడిద సమీపంలోని సీతారామ ఫుడ్స్ రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ధాన్యం, బియ్యం, నూకలు కొనుగోలు, అమ్మకాలు, గోదాముల్లోని సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు బి రిజిష్టర్‌లో నమోదు చేయాల్సి ఉన్నా, నిర్వహణ సక్రమంగా జరగడం లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రిజిష్టర్‌లోని సరుకుల వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు పొంతన లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు. నిల్వల మధ్య వ్యత్యాసంతో అరవింద్ ఆగ్రోస్‌లోని రూ. 1.55 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.
శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ ఫ్లోర్ మిల్లులో వారం రోజులుగా బి రిజిష్టర్ నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. రూ. 78.5 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం, నూకల అక్రమ నిల్వలు ఉన్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు. సీతారామ ఫుడ్స్‌లో రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు వ్యత్యాసం ఉండడంతో రూ. 78 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. జానకిరామ రైస్‌మిల్లులో రాత్రి వరకూ తనిఖీలు కొనసాగాయి. రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో సుమారు రూ. 1.70 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను సీజ్ చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలి పారు. ఆయా మిల్లులకు చెందిన నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదుచేశామన్నారు. ఈ తనిఖీ లో సీఐలు గౌస్‌బేగ్, వరప్రసాద్, ఏజీ ఎం. శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓ ఎస్‌కె వల్లీ, డీసీటీఓ రత్నకుమార్, కానిస్టేబుళ్లు పి.గణేష్, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రైసు మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు
Published Fri, Jan 10 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement