
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, పునరావాస, పునర్నిర్మాణ పనుల కోసం తక్షణమే రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. నీటి సంక్షోభం నివారణ కోసం జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై మంగళవారం రాజ్యసభలో ‘కాలింగ్ అటెన్షన్ మోషన్’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నుంచి ఆయన కొన్ని వివరణలు కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే గ్రామాల్లోని వేలాది మంది రైతులు, దళితులు, గిరిజనుల కుటుంబాలను ఖాళీ చేయించడం జరిగిందని తెలిపారు. నిర్వాసితుల పునరావాసానికి రూ.16 వేల కోట్ల నిధుల తక్షణ అవసరం ఉందని పేర్కొన్నారు.
పోలవరం నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి కంటే ముందుగానే రూ.16 వేల కోట్లునిధులను విడుదల చేయాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. ఎప్పటిలోగా ఈ నిధులను విడుదల చేస్తారో తెలపాలని జలశక్తి మంత్రిని విజయసాయిరెడ్డి కోరారు.