కాంగ్రెస్ గూటీకి రాములమ్మ
Published Fri, Aug 9 2013 5:02 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి :తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మెదక్ లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మెదక్ ఎంపీ గురువారం రాత్రి ఢిల్లీలో కలిశారు. ఒకటి రెండు రోజుల్లో చేరిక తేదీపై విజయశాంతి స్పష్టత ఇస్తారని సమాచారం. రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్‌లో చేరికపై సోనియాగాంధీతో విజయశాంతి తన మనోగతాన్ని వెల్లడించినట్లు తెలిసింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అంశాన్ని సోనియా ఎదుట ప్రస్తావించినట్లు సమాచారం. కాగా, విజయశాంతి కాంగ్రెస్‌లో చేరికపై టీఆర్‌ఎస్ జిల్లా నేతలు, కాంగ్రెస్ నేతలు స్పందించేందుకు సుముఖత చూపడం లేదు.
కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న విజయశాంతిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జూలై 31 అర్ధరాత్రి వేటు వేసిన విషయం తెలిసిందే. విజయశాంతి పార్టీని వీడినా పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు నాలుగేళ్లుగా మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా కేడర్‌తో సత్సంబంధాలు నెరపడంలో విజయశాంతి విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. జిల్లా సమస్యలపై అవగాహన లేకపోవడంతో అధికారిక సమీక్షలకు దూరంగా వుంటూ వచ్చారు. విజయశాంతి చేరిక వల్ల వచ్చే లాభనష్టాలపై పార్టీ అధిష్టానం అంచనాకు వచ్చిన తర్వాతే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉంటారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నరేంద్రనాథ్ భవితవ్యమేమిటో?
దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చొరవతో రాజకీయ అరంగేట్రం చేసిన చాగన్ల నరేంద్రనాథ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వ్యాపారవేత్త నరేంద్రనాథ్ 2009 ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణవాదం, విజయశాంతి సినీ గ్లామర్‌ను తట్టుకుని కేవలం 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు చోట్ల నరేంద్రనాథ్ ఆధిక్యత సాధించారు. ఓటమి తర్వాత కూడా నాలుగేళ్లుగా నియోజకవర్గానికి రాకపోకలు సాగిస్తూ 2014 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నరేన్ చారిటబుల్ ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. విజయశాంతి చేరికతో తన రాజకీయ భవితవ్యంపై సన్నిహితులతో సమాలోచన చేస్తున్నారు.
Advertisement