ఏపీ రాజధాని విజయవాడే
* టీడీపీ నేతల వర్క్‌షాప్‌లో పరోక్షంగా వెల్లడించిన చంద్రబాబు
* బెజవాడ కేంద్ర బిందువుగా రాష్ట్రంలో రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
* సముద్ర తీరం, ఖనిజ సంపద, దేవాలయాలను వినియోగించుకుని పేదరికాన్ని నిర్మూలిస్తామన్న సీఎం
* 14 నౌకాశ్రయాలు, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రతి జిల్లాకో విమానాశ్రయమం ఏర్పాటు చేస్తామని వెల్లడి
* వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్‌ల ద్వారా వసతులు కల్పిస్తామన్న బాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం పార్టీ నేతల వర్క్‌షాప్‌లో పరోక్షంగా వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌లో రోడ్ గ్రిడ్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉంది. ఇక్కడి నుంచి కర్నూలు, నంద్యాల మీదుగా బెంగళూరుకు జాతీయ రహదారిని నిర్మించే ప్రతిపాదన చేయాలి’ అని చెప్పారు. సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో రోడ్డు గ్రిడ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ కేంద్ర బిందువుగానే ఈ రోడ్ గ్రిడ్‌ను అధికారులు రూపొందించారు. ఇదే అంశాన్ని గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో కూడిన మ్యాప్‌ను పార్టీ నేతలకు చూపిస్తూ.. ఆయా జిల్లాల నుంచి విజయవాడకు రహదారులను ఎలా విస్తరించాలనుకుంటున్నామో వివరించారు. కర్నూలు, అనంతపురం, కడప తదితర జిల్లాల నుంచి విజయవాడకు త్వరగా చేరాలంటే ఎక్కడి నుంచి రహదారులను నియమిస్తే సులభతరంగా ఉంటుందో కూడా చెప్పారు. ఇలా రాష్ట్రమంతటికీ కేంద్ర బిందువుగా విజయవాడను చూపిస్తూనే రాష్ట్ర రాజధాని ఎక్కడనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ.. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీతో భేటీల్లో విజయవాడ - గుంటూరు ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు ప్రతిపాదించటం.. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల కిందట వెల్లడించడం.. అక్కడకు ప్రభుత్వ కార్యాలయాలను వేగంగా తరలించేందుకు కసరత్తు చేస్తుండటం.. తాజాగా విజయవాడ కేంద్ర బిందువుగా రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించటం.. ఇదంతా రాష్ట్ర రాజధానిగా విజయవాడనే చంద్రబాబు నిర్ణయించారని స్పష్టంచేస్తోందని టీడీపీ నేతలే చెబుతున్నారు.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో.. ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రచారం, గ్రిడ్లు, మిషన్లు అనే మూడు అంశాల చుట్టూనే ప్రభుత్వ పాలన సాగుతుందని వివరించారు. ఈ వర్క్‌షాప్‌కు ‘సాక్షి’ ప్రతినిధులను చంద్రబాబు అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్త ఇవ్వటం జరిగింది.
చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
దేశంలో ఏ రాష్ట్రానికీ లేనటువంటి సముద్ర తీరంతో పాటు అపారమైన ఖనిజ సంపద, వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే దేవాలయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని పేద రికం నిర్మూలించటంతో పాటు ఆరోగ్యకర, ఆనందమైన స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించటమే లక్ష్యం. రాష్ట్రంలో 14 నౌకాశ్రయాలు, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయమం ఏర్పాటు చేస్తాం. శ్రీకాకుళం నుంచి మైపాడు వరకూ ఉన్న బీచ్‌లు, చారిత్రక కట్టడాలను అనుసంధానం చేయటం ద్వారా బీచ్, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం.
పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్లు కార్యక్రమాలను ప్రచారాంశాలుగా చేసుకుని రానున్న ఐదు సంవత్సరాలు పార్టీ ప్రజాప్రతినిధులు పని చేయాలి.
వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్‌ల ద్వారా సామాన్యులకు అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తాం. మౌలిక వసతుల కల్పనకు అర్బన్, ఇండస్ట్రీ, మౌలిక సదుపాయాలు, సర్వీస్, నైపుణ్యత పెంపు, సాధికారిత, ప్రైమరీ మిషన్లను ఉపయోగించుకుంటాం. అన్ని శాఖలను ఈ మిషన్లకు అనుసంధానం చేస్తాం. సూచికలు ఏర్పాటు చేస్తాం. నీటి గ్రిడ్ ద్వారా సాగునీరు, పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూస్తాం. రోడ్ గ్రిడ్ ద్వారా రవాణా వ్యవస్థను మెరుగు పరచటంతో పాటు ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మిస్తాం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ముందుకొచ్చారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. పలు విద్య, ప్రభుత్వ సంస్థల ఉమ్మడిగానే ఉన్నాయి. పరస్పర అంగీకారంతోనే విభజన జరగాలి. సమన్వయంతో ముందుకు వెళ్లాలి.