ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ప్రతి 100 మందిలో 30 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే వాహన చోదకుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన మోటార్ వాహన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ నగరంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. విజయవాడలో 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇందులో 60 శాతం మందికి పైగా వాహనచోదకులు హెల్మెట్ లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు.
నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని వారే అధికంగా మృత్యువాత పడుతున్నారు. నగరంలో జనవరి 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేస్తారు. వారి డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్ చేయబోతున్నారు. సస్పెన్షన్ సమయంలో మళ్లీ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్ చేయనున్నారు. సెప్టెంబరులో కృష్ణా జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలు పాటించని 372 మందిపై చర్యలు తీసుకున్న సంగతి విదితమే. వీరిపై కేసులు నమోదు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌లను సైతం సస్పెండ్ చేశారు. మళ్లీ జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
ఇన్సూరెన్స్ సొమ్ము రాదు
‘‘కేంద్ర మోటార్ వాహన చట్టం 138(ఎఫ్) ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్సు రద్దుచేసిన సమయంలో వాహనం నడుపుతూ మరోసారి పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా వాహనం సీజ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా లైసెన్స్ రద్దు సమయంలో వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ సొమ్ము రాదు’’
– ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment