
కేశినేని నానికి మళ్లీ కోపమొచ్చింది
ప్రొటోకాల్‌కు నీళ్లొదిలిన అధికారులు
ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారనే విమర్శలు
ముఖ్యమంత్రి హెచ్చరికలనూ పట్టించుకోని అధికారులు
విజయవాడ : ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)కు మళ్లీ కోపం వచ్చింది. జిల్లా అధికారుల వ్యవహార తీరుపై ఇప్పటికే ఆయన పలుమార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. అయినా అధికారులు ఏమాత్రమూ మారడం లేదు. ప్రజాప్రతినిధులను అవమానిస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ అవమానాలను దిగమింగి, ముందుకెళ్తున్నారు. ఎంపీ కేశినేని నాని మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వంటి ముఖ్యులు వచ్చినప్పుడు కూడా ప్రొటోకాల్ పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అధికార పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోకి కొంతమంది కీలక వ్యక్తుల సూచనల మేరకు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తూన్నారన్న అనుమానాలను ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్, జేసీపై కేశినేని సీరియస్
మచిలీపట్నంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కమిటీలో కో కన్వీనర్‌గా ఉన్న ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)ను ప్రొటోకాల్ ప్రకారం వేదిక పైకి ఆహ్వానించలేదు. ఆయనకు సీటు కూడా కేటాయించలేదు. ఈ సమావేశంలో కలెక్టర్ అహ్మద్ బాబు.ఎ, జాయిట్ కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. కన్వీనర్ ఎంపీ కొనకళ్ల నారాయణ తరువాత కో- కన్వీనర్‌ను పిలవాలి. అయితే ఆయన్ను పక్కన పెట్టిన అధికారులు మంత్రులు, డెప్యూటీ స్పీకర్‌ను పిలిచారు. ఆ తరువాత జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు నానిని వేదికపైకి ఆహ్వానించేసరికి ఆయన సీరియస్సయ్యారు. వాస్తవంగా ఈ సమావేశానికి కన్వీనర్, కో-కన్వీనర్, కలెక్టర్ మాత్రమే నిర్వహించాలి. అయితే కో-కన్వీనర్‌నైన తనను చివర్లో వేదికపైకి ఆహ్వానించడంతో నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయనను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రొటోకాల్‌కు నీళ్లు
విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన తెప్పోత్సవంలోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలను పక్కన పెట్టి సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి ప్రొటోకాల్ లిస్టు తయారు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ కేశినేని నాని ప్రొటోకాల్ వివరాలు ఇవ్వాలంటూ ఏకంగా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో కలెక్టర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలను అధికారులు బేఖాతర్ చేస్తూనే ఉండటంతో విజయవాడ ఆటోనగర్‌లోని జరిగిన ఒక సమావేశంలో ఎంపీ కేశినేని నాని సీరియస్ అయ్యారు. కేవలం మంత్రులకే ప్రాధాన్యం ఇస్తూ ఎంపీ, ఎమ్మెల్యేలను అవమానించడంపై నిలదీశారు. అదే సమావేశంలో నగర పోలీసులు అమలు చేసిన నైట్ డామినేషన్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. ఎమ్మెల్యేల సూచనలను కలెక్టర్ అహ్మద్ బాబు.ఎ బేఖాతర్ చేయడంపై ఆగ్రహించిన సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తదితరులు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కూడా తరచుగా అధికారులను హెచ్చరిస్తున్నా వారి తీరు మారకపోవడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఉన్నారు.