ఉమా మమ్మల్ని సంప్రదించడం లేదు: కేశనేని నాని
విజయవాడ : తెలుగుదేశం పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. అధికార పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. మంత్రులకు, ఎంపీలకు మధ్య సమన్వయం కుదరటం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశనేని నాని... ఇరిగేషన్ మినిష్టర్ దేవినేని ఉమమహేశ్వరరావుపై విరుచుకుపడ్డారు.
దేవినేని ఉమ చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారని ఆయన శుక్రవారమిక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విషయంలోనూ దేవినేని ఉమ ...తమను సంప్రదించటం లేదని కేశినేని నాని అసంతృప్తి వెలిబుచ్చారు. అధికారులు ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకు రావటం లేదని విమర్శించారు. సంబంధిత విషయాల్లో మంత్రిని ఒక్కరినే సంప్రదిస్తే సరిపోదని... ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలుపుకొని వెళ్లాలన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనే లేని నైట్ డామినేషన్ బెజవాడలో ఎందుకుని కేశనేని నాని ప్రశ్నించారు.