విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థకు రూ.10 కోట్ల 40 లక్షల 1400 జరిమానా విధిస్తూ ఆదాయపు పన్ను శాఖ తాఖీదులిచ్చింది. రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయకపోవడంపై సీరియస్ అయింది. మూడు, నాలుగు రోజుల్లో ప్రత్యక్ష చర్యలకు దిగేందుకు సన్నద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రూ.2.24 శాతం చొప్పున కార్పొరేషన్ మినహాయిస్తోంది. 2012-13, 2013-14 సంవత్సరాలకు సంబంధించి మినహాయించిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖకు జమ చేయనట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ నగరపాలక సంస్థ అధికారుల తీరులో మార్పు రాలేదు.
ఈ క్రమంలో ఐటీ శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది మార్చిలో కార్పొరేషన్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసింది. అప్పటి కమిషనర్ పండాదాస్ జోక్యం చేసుకుని ఆ శాఖ అధికారులతో చర్చించారు. ఆగమేఘాల మీద సొమ్ము చెల్లించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాతకథే పునరావృతం అయ్యే పరిస్థితి దాపురించింది.
అధికారుల మల్లగుల్లాలు
నగరపాలక సంస్థలో 380 డ్వాక్వా గ్రూపులు, 150 మంది చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరితో పాటు శాశ్వత ఉద్యోగుల నుంచి పన్ను మినహాయిస్తున్నారు. డ్వాక్వా గ్రూపులకు సంబంధించి అత్యధిక శాతం టాక్స్‌ను ఆదాయ పన్ను శాఖకు చెల్లించినప్పటికీ రిటర్న్స్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపి కాంట్రాక్టర్ల నుంచి మినహాయించిన మొత్తాన్ని జమ చేయలేదని సమాచారం.
తమకు ఇచ్చే బిల్లుల్లో కార్పొరేషన్ అధికారులు టాక్స్ మినహాయించుకున్నప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో తమ సొంత సొమ్ము చెల్లించి ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. తాజాగా నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
విజయవాడ నగరపాలక సంస్థకు ఐటీ శాఖ ఝలక్
Published Sat, Oct 18 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Advertisement