అక్రమార్కులపై కన్ను
అక్రమార్కులపై కన్ను
Published Sat, Jul 23 2016 5:21 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
విజయవాడ నగరపాలక సంస్థలో పెచ్చుమీరిన అవినీతిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. టౌన్‌ప్లానింగ్, ప్రజా రోగ్యం, ఇంజనీరింగ్ విభాగాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఓ అధికారి అర్ధంతర రిలీవ్ వెనుక కూడా అవినీతి ఆరోపణలే కారణమని సమాచారం. సీఎం పేషీ జోక్యం చేసుకోవడంతో ఆ అధికారి మూటాముల్లె సర్దుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
విజయవాడ సెంట్రల్ :
నగరపాలక సంస్థలో పాలన గాడి తప్పింది. ప్రతి పనికి అక్రమార్కులు చేయి చాస్తున్నారు. ఇక టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని అవినీతి జాఢ్యం పట్టిపీడిస్తోంది. అక్రమ నిర్మాణాల నుంచి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) వరకు దేన్నీ వదలకుండా అవినీతి రాయుళ్ళు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీపీఎస్ పథకం కింద 6,903 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల రూపంలో రూ.5.95 కోట్లు జమ అయ్యాయి. క్షేత్రస్థాయిలో వీటిని పరిష్కరించినట్లైతే సుమారు రూ.50 కోట్ల పైనే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులోనూ అక్రమార్కులు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కాసులు వచ్చే వాటిని మాత్రమే పరిష్కరిస్తూ మిగిలిన ఫైళ్ళనుపక్కన పడేశారు. ఇప్పటి వరకు సుమారు 820 దరఖాస్తుల్ని మాత్రమే పరిష్కరించారని సమాచారం.
రిలీవ్ వెనుక ఏసీబీ
టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని ఆన్‌లైన్ చేసిన నేపథ్యంలో అవినీతిరాయుళ్ళు క్షేత్రస్థాయిలో కాసుల వేట ప్రారంభించారు. ఫైన్ ముసుగులో ఇబ్బడిముబ్బడిగా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటాల్లో తేడాలు రావడంతో కొందరు సిబ్బంది అక్రమాల గుట్టును ఏసీబీకి ఉప్పందించారని తెలుస్తోంది. ఓ అధికారి తీరు సక్రమంగా లేకపోవడంతో ఏడాది తిరక్కుండానే సాధారణ బదిలీ వేటు వేశారు. ఆయన్ను రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారి ససేమిరా అన్నారు. ఆ అధికారిని ఏసీబీ టార్గెట్ చేస్తోందంటూ పైస్థాయి నుంచి సమాచారం అందడంతో గప్‌చుప్‌గా రిలీవ్ చేసేశారు. ఉన్నతాధికారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఆ అధికారి పలువురి వద్ద చెప్పడం కార్పొరేషన్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారీగా అవకతవకలు ...
ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖ విభాగాల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాల నేపథ్యంలో నగరంలో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల్లో భారీగానే ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రజారోగ్య శాఖలో సీట్ల మార్పిడి, కాంట్రాక్టుల మంజూరు వెనుక భారీగా అమ్యామ్యాలు ముడుతున్నాయనే అభియోగాలు ఉన్నాయి. పనికి వస్తారనుకున్న ఉద్యోగులకు రెండుమూడు పోస్టుల్ని కట్టబెట్టటం వెనుక తిర ‘కాసు’ కథ నడుస్తోందనేది బహిరంగ రహస్యం. రోడ్ల నిర్మాణం ముసుగులో కొందరు అధికారులు అక్రమాలకు తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్‌టీఎస్ రోడ్డు, సాంబమూర్తి తదితర రోడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఓ కార్పొరేటర్ విజిలెన్స్, ఏసీబీలకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ విషయాలను నగరపాలక సంస్థలో ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఏసీబీ, విజిలెన్స్‌ను ఆశ్రయించినట్లు ఆ కార్పొరేటర్ బాహాటంగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అక్రమార్కులు బెంబేలెత్తుతున్నారు.
Advertisement