పల్లె నవ్వింది. కష్టాల కారు మేఘాల నుంచి బయటపడి ఎల్లుట్ల మెరుపల్లే మెరిసింది. ఆనందంతో నిలువెల్లా మురిసింది. వలంటీర్ల సేవలకు చేతులెత్తి సలాం చేస్తోంది. గ్రామం అభివృద్ధికి ఆమడ దూరం అనే మాటకు కాలం చెల్లింది. రేపటి ఆశల పచ్చని పందిరి.. ఎల్లుట్లను చూసొద్దాం రండి
రామలక్ష్మికి ఇప్పుడు తాగునీటి బెంగలేదు. నాగలక్ష్మికి మగ్గం ఆగుతుందన్న చింత లేదు.పింఛన్ కోసం తిరుపాలు ఇప్పుడు ఏ గుమ్మం తొక్కాల్సిన పనిలేదు. ఆటో చక్రం ఆగితే ఓబులయ్య చేతులు సాచే పనిలేదు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఇక ఎంతమాత్రమూ కల కాదు. అది తలెత్తుకు నిలబడిన ఎల్లుట్ల గ్రామమంతటి వాస్తవం. రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడటంతో రూపుదిద్దుకున్న వైభవం.
సాక్షి, అనంతపురం: ఆ ఊరు మండల కేంద్రం నుంచి విసిరేసినట్లు చిట్టచివరలో ఉంటుంది. గ్రామం నుంచి మండల కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్లు. పాసుబుక్కులు, బ్యాంకు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, హౌసింగ్, అగ్రికల్చర్ కార్యాలయం ఇలా ఏ చిన్న పనికోసం వెళ్దామన్నా బస్సులు, ఆటోలు లేవు. బైకులు ఉంటే సరే. బస్సులో వెళ్లాలంటే దాదాపు 65 కిలోమీటర్లు చుట్టేసుకుని వెళ్లాలి. ఇంత శ్రమ పడి అక్కడికి వెళ్లినా ఒక్కరోజులో పని అవుతుందనే నమ్మకం ఉండేది కాదు. చాలా పనులు కాక, మళ్లీ అంతదూరం వెళ్లలేక ఆ పనులు పెండింగ్ పడిపోయేవి. ఇవీ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ప్రజల కష్టాలు. ఇప్పుడు పరిస్థితి మారింది. నేరుగా ఇంటివద్దనే సేవలందుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ ఈ ఊరి ప్రజల కష్టాలను దూరం చేసింది. రేషన్‌కార్డు మొదలుకుని 1–బీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాల అమలుకు దరఖాస్తు ఇక్కడే చేసుకుంటున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గ్రామస్థాయిలో ఏ విధంగా ఉన్నాయనే అంశాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ బృందం ఎల్లుట్ల గ్రామాన్ని సందర్శించింది.
గ్రామస్తుల మాటలు వినండి..
20 ఏళ్ల సమస్య 2 నెలల్లో పరిష్కారం
► గ్రామంలోని అంబేడ్కర్ కాలనీలో దాదాపు 110 కుటుంబాలు ఉన్నాయి. 20 ఏళ్లుగా ఈ కాలనీలో మంచి నీటికి కటకట. లెక్కలేనన్నిసార్లు పుట్లూరుకు వెళ్లి ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా లాభం లేకపోయింది.
► 2019లో సచివాలయం ఏర్పడ్డాక కాలనీ వాసులు ఒక అర్జీ ఇవ్వగానే 14వ ఆర్థిక సంఘం నిధులతో పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించి 2 నెలల్లో నీళ్లు వచ్చేలా చేశారు.
► ఏడాది కాలంగా గ్రామంలో శానిటేషన్ సెక్రటరీ నిత్యం పారిశుధ్య పనులపై దృష్టి పెడుతున్నాడు. గ్రామంలోని 11 మంది వలంటీర్లు కూడా ఈ విషయంపై బాగా
శ్రద్ధ చూపుతున్నారు.
‘అనంత’ జిల్లా..ఎల్లుట్ల గ్రామం
అడగ్గానే అడంగల్
► సచివాలయం వద్దకు వెళ్లి 1బీ అడంగల్ కావాలని అడిగితే కాసేపట్లేనే ఇచ్చేస్తున్నారు. అమ్మ ఒడి దరఖాస్తులో పేరు తప్పుగా పడిందని వెళితే వెంటనే మార్చేశారు. నిజంగా ఈ ఆఫీసు రావడం వల్ల ఇంత ఉపయోగం ఉంటుందని ఊహించలేదు. ఏదో చెబుతున్నా రు.. ఏం చేస్తారో ఏమో అనుకున్నాం. కానీ నిజంగా మాకు చాలా కష్టాలు తప్పాయి. సమయం ఆదా అయింది.
► పాసుబుక్కులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, హౌసింగ్, అగ్రికల్చర్ కార్యాలయం.. ఇలా ఏ చిన్న పనికోసం మండల కేంద్రానికి బైకుల్లో వెళితే 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వెళ్లాలంటే దాదాపు 65 కిలోమీటర్లు చుట్టేసుకుని వెళ్లాలి. అలా వెళ్లలేక పనులన్నీ అలాగే నిలిచిపోయేవి. ఒకవేళ వెళ్లినా పని అవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు మా ఎదుటే సచివాలయం ఉండడంతో అర్జీ ఇచ్చిన వెంటనే స్పందిస్తున్నారు.
► ఏ విషయం గురించి అడిగినా వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు వెంటనే చెబుతున్నారు. వారికి తెలియక పోతే పై అఫీసర్లను కనుక్కుని చెబుతున్నారు.
ఇంటికే పంట విత్తనాలు
► గతంలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం మండల కేంద్రం పుట్లూరుకు వెళ్లి పడిగాపులు కాసేవారం. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యూలో నిల్చున్నా చివరికి దొరికేవి కాదు. మరుసటిరోజు పోయినా అదే సమస్య ఉండేది. దీంతో విసుగెత్తి వదులుకునేవారం. కానీ ఇప్పుడు గ్రామానికే తీసుకొచ్చి ఇస్తున్నారు.
► మా గ్రామంలో ఉన్న రెండు బెల్టుషాపులను ఎత్తేశారు. మద్యం తాగేవారి సంఖ్య బాగా తగ్గింది. ఎవరైనా మద్యం తాగా లనుకున్న వారు 12 కిలోమీటర్ల దూరంలోని నార్పలకు వెళ్లాలి.
► ఏ చిన్నపని కోసమైనా మండల కేంద్రం పుట్లూరుకు బస్సుల్లో వెళ్లాలంటే నార్పల, అక్కడి నుంచి తాడిపత్రికి అక్కడి నుంచి పుట్లూరుకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేరుగా ఇంటి వద్దకే సేవలందుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా 65 కిలోమీటర్లు కాదు కదా.. 65 మీటర్ల దూరంలోని సచివాలయంలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
► రేషన్‌కార్డు మొదలుకుని కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలకు దరఖాస్తులు.. అన్నీ ఇక్కడే. ఏ పథకానికి ఎవరికి అర్హత
ఉందో వలంటీర్లు మరీ అడిగి దరఖాస్తు చేయిస్తున్నారు.
నాలుగు పథకాల లబ్ధి
నా కూతురు డిగ్రీ చదువుతోంది. విద్యా దీవెన , వసతి దీవెన పథకాల కింద సొమ్ము అందింది. నాకు ఇద్దరు మగ పిల్లలు. 8వ తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేశారు. నాకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందజేశారు.
– నరసింహులు, రైతు
వలంటీర్‌కు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే పింఛన్ వచ్చింది
గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని సార్లు పింఛన్ కోసం అర్జీలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పింఛన్ వచ్చేది. టీడీపీ ప్రభుత్వంలో నా పేరును తీసేశారు. నాకు వయస్సు ఉంది సామి అని మొత్తుకున్నా పట్టించుకోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వలంటీర్‌కు నా ఆధార్ కార్డు, అప్లికేషన్ ఇచ్చా. వెంటనే పింఛన్ మంజూరు చేశారు. ప్రతినెలా రూ.2,250
ఇంటివద్దకు తెచ్చిస్తున్నారు.
– తిరుపాలు, వృద్ధాప్య పింఛన్‌దారుడు
ఎలాంటి సిఫార్సు లేకుండానే ‘నేతన్న నేస్తం’
మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఆర్థికసాయం అందింది. ఈ సొమ్ముతో మగ్గానికి మోటర్లను ఏర్పాటు చేసుకున్నా. మగ్గం పనులు చేపడుతుండటంతో ఎలాంటి సిఫార్సు లేకుండానే వలంటీర్లు ఫోటోలు తీసుకుని నాకు ఆర్థిక సహాయం వచ్చేలా చేశారు. నాకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు జితేంద్ర ప్రసాద్ బిటెక్ మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వసతి దీవెన కింద లబ్ధి చేకూరింది.
– నాగలక్ష్మి, చేనేత కార్మికురాలు
Comments
Please login to add a commentAdd a comment