
విలన్‌గా రాణించాలనే వచ్చా
హీరోగానూ పేరు రావడం అదృష్టం
సినీనటుడు మోహన్‌బాబు
విశాఖపట్నం: సినిమాల్లో విలన్‌గా రాణించాలనే కోరికతోనే తన ఊరి నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చానని సినీ నటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబు చెప్పారు. తనది మధ్యతరహా కుటుంబమని, పుట్టుకతో తనకు ఆస్తులు లేవని చెప్పిన ఆయన భగవంతుని దయతో సినీ రంగంలో విభిన్న పాత్రలు పోషించి హీరోగా, నిర్మాతగా ఎదిగానన్నారు. టీఎస్సార్ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి జీరో అయ్యానని... భగవంతుని దయతో ‘అల్లుడుగారు’ సూపర్ డూపర్ హిట్ అయి తనను హీరోగా, నిర్మాతగా నిలబెట్టిందన్నారు. కె.రాఘవేందర్రావు దర్శకత్వంలో దేవత, కొండవీటి సింహం, అల్లుడుగారులాంటి హిట్ చిత్రాలలో నటించానన్నారు. విలన్ కావాలని కోరుకున్నా హీరోగా కూడా ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టమన్నారు.
హుద్‌హుద్ తుపాను కలచివేసింది
హుద్‌హుద్ తుపాన్ తనను కలచి వేసిందని, విశాఖ ప్రజలను ఆదుకోవడానికి తనవంతు సాయంగా రూ.30 లక్షలు తన కుమారుడు మనోజ్‌కుమార్‌తో పంపించానని చెప్పారు. మనోజ్, అతని అభిమానులు ఆ డబ్బులతో బాధితులకు అవసరమైన సాయం అందించారని మోహన్‌బాబు చెప్పారు. తన విద్యాసంస్థల సిబ్బంది అందించిన ఒక నెల జీతాన్ని త్వరలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేస్తానన్నారు. త్వరలోనే తన ఇంజనీరింగ్ సంస్థ విద్యార్థులతో విశాఖలో అవసరమైన చోట మొక్కలు నాటే కార్యక్రమం చేపడతానన్నారు.