
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తంగా మారింది. మాలమల్లేశ్వరుల విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ రణరంగంలో 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
కర్నూలు జిల్లా దేవరగట్టు కొండలో వెలసిన మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధానికి దిగడం అక్కడి ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. దీనిని బన్నీ ఉత్సవంగా పిలుస్తారు. దీనిలో భాగంగా ఏటా దసరా పర్వదిననం రోజు దేవరగట్టు పరిధిలోని 11 గ్రామాలు ప్రజలు ఉత్సవ విగ్రహాల కోసం చిన్నపాటి యుద్దమే చేస్తారు. కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి అర్దరాత్రి కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయల్దేరుతారు. ఈ సందర్భంగా విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. అయితే ఈ సంప్రదాయంపై పోలీసులు ఎన్ని అంక్షలు విధించినా ఆనవాయితీ పేరిట ఏటా ఈ రక్తపాతం జరుగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment