కొనకనమిట్ల, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల్లో జ్వరపీడితులు వణికిపోతున్నారు. నెలల తరబడి ప్రజలను జ్వరాలు వదలటం లేదు. ఒకరి తర్వాత మరొకరికి జ్వరం వస్తూనే ఉంది. వేలకు వేలు ఖర్చుపెట్టి ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. జ్వరం తగ్గిన వారం రోజులకు మళ్లీ తిరగబెడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మండలంలోని సిద్ధవరం, చేరెడ్డివారిపలిల్లో పలువురు విషజ్వరాలతో మంచంపట్టారు. వారం రోజులుగా జ్వరాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలువురు స్థానిక ఆర్‌ఎంపీ, పొదిలిలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చికున్ గున్యాతో గంజి నారాయణ దంపతులు, హుసేన్‌బాబు బాధపడుతూ ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు.
ఎస్సీ కాలనీకి చెందిన మరియమ్మ చికున్‌గున్యాతో మంచంపట్టింది. చిన్నారులు సైతం జ్వరాలతో అల్లాడుతున్నారు. వృద్ధులు కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. రోగాల బారిన పడిన కొంతమంది ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకోగా మరికొందరు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బిళ్లలు వేసుకుని సరిపెట్టు కుంటున్నారు. ఇటీవల కురిసిన అరకొర వ ర్షాలకు నీటిలో మార్పు రావటంతో పాటు పారిశుధ్యం అధ్వానంగా ఉండటం వల్లే ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువగా టైఫాయిడ్, చికున్‌గున్యాతో అల్లాడుతున్నారు. దోమలు పగలు రాత్రి తేడా లేకుండా స్వైరవిహారం చేస్తున్నాయి. జ్వరాలతో పాటు శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బాలికకు డెంగీ
మండలంలోని వెలిగండ్లలో ఉండేలా శ్రావణి (9) అనే బాలిక డెంగీ లక్షణాలతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు. శ్రావణి జ్వరంతో బాధపడుతుండటంతో ఒంగోలు తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్తున్నట్లు బంధువులు తెలిపారు. వెలిగండ్లలో కూడా జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
వణికిస్తున్న విషజ్వరాలు
Published Sat, Oct 19 2013 6:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement
Advertisement