వ్యాధులతో విలవిల
- కన్నంపేటలో జ్వరానికి మరొకరు బలి
- మూడుకు చేరిన మృతుల సంఖ్య
- జన్నవరం, నూతన గుంటపాలెంలో డెంగ్యూ
రావికమతం/చోడవరంటౌన్ : ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లా వాసులు విషజ్వరాలు, చికున్‌గున్యా, మలేరియా, అతిసార, డెం గ్యూ లక్షణాలతో విలవిల్లాడుతున్నారు. జనవరి నుంచి ఆగస్టు 14 వరకు జిల్లాలో 2,35,88 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా మూడు వేలమందికి మలేరియాగా నిర్ధారణయింది. ఇది జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది.
రావికమతం మండలం కన్నంపేటను జ్వరాలు పీడిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజుల్లో గ్రామంలో ముగ్గురు చనిపోయారు. సోమవారం రాత్రి చింతల రామునాయుడు(58),బుధవారం విద్యార్థి అమృత(9)చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి గ్రామస్తులు తేరుకోక ముందే విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గనిశెట్టి కన్నబాబు(45) గురువారం చనిపోయాడు. గ్రామంలో తాగునీరు బాగోలేదు. కలుషితమైందని సర్పంచ్ దంట్ల అరుణ, ఎంపీటీసీ సభ్యుడు బంటు శ్రీను తెలిపారు.
డెంగ్యూ చాయలు : జిల్లాలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయి. కశింకోట మండలం నూతన గుంటపాలెంలో అయిదుగురు డెంగ్యూతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇదే గ్రామంలో మరో 20 మంది జ్వరాలతో మంచానపడి విలవిల్లాడుతున్నారు. చోడవరం మండలం జన్నవరంలో ఒకరికి డెంగ్యూ సోకింది. గ్రామానికి చెందిన నూకరాజుకి జ్వరం తగ్గకపోవడంతో అనకాపల్లి ఎన్టీర్ ఆస్పత్రిలో చూపించుకున్నాడు. అనంతరం చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ రక్త పరీక్షల అనంతరం డెంగ్యూగా నిర్ధారించాఎస్‌పిహెచ్‌ఓ పార్దసారది తెలిపారు. అయితే జన్నవరం గ్రామానికి వైద్యబృందాన్ని తరలించి అన్ని పరిశీలించామని ప్రస్తుతం గ్రామంలో అంతా బాగానే ఉందని ఆయన తెలిపారు.
వీడని జ్వరాలు
రోలుగుంట: మండలంలోని కొవ్వూరు, వడ్డిప గ్రామాలను జ్వరాలు వీడడం లేదు. ఒక వీధిలో అదుపులోకి వస్తే మరో వీధిలో ప్రబలుతున్నాయి. వైద్యాధికారి విజయకుమారి గురువారం ఒక్కరోజే వడ్డిపలో 65 మందికి సేవలు అందించారు. వీరిలో 25 మందికి జ్వరాలు, అయిదుగురికి చికుకున్ గున్యాగా గుర్తించారు. కొవ్వూరులో 50 మందికి తనిఖీ చేయగా 19 మందికి జ్వరాలు, నలుగురికి చికున్‌గున్యాగా గుర్తించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చేవూరి ప్రకాష్, స్థానిక ఎస్సీ వ సతి గృహంలో జ్వరంతో బాధపడుతున్న సాగిన మాన్‌చంద్‌కు సేవలు అందించారు.