విశాఖకు ఉజ్వల భవిష్యత్తు | Visakhapatnam bright future | Sakshi
Sakshi News home page

విశాఖకు ఉజ్వల భవిష్యత్తు

Published Mon, Sep 1 2014 1:08 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Visakhapatnam bright future

  •      రాష్ట్రానికే తలమానికం
  •      పరిశ్రమల ఏర్పాటుకు వనరులు అమోఘం
  •      మంత్రి గంటా, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య
  • అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి బైపాస్‌రోడ్డులోని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయించనప్పటికీ విశాఖ అభివృద్ధిలో ముందుకు వెళ్లడం ఖాయమని, దీనికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరుగుతుందని తెలిపారు.

    పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రహదారులు విస్తరించాల్సి ఉందని, అవసరమైన చోట ఫ్లైఓవర్లు నిర్మించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించుకునే ప్రతిపాదన ఉందని, దీనికి గానూ ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. రాష్ట్రంలో 11 సంస్థలు, 13 పోర్టుల నిర్మాణం జరగనుందని వివరించారు. అనకాపల్లి మండలంలో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని గుర్తించి పరిశమ్రలకు వినియోగించాలని యోచిస్తున్నామన్నారు.

    గతంలో ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు భూములు పొందిన యాజమాన్యాలు వాటిని వినియోగించనట్టు తెలుస్తోందని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ సంస్థల ఎండీలు, సీఇఓలతో సమావేశమై భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్ధేశం చేస్తామని తెలిపారు.
     ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. విశాఖపట్నం రాష్ట్రానికే తలమానికమని, ఇక్కడున్న వనరులు, వాతావరణ స్థితిగతుల కారణంగా పరిశ్రమలతో పాటు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని వివరించారు.

    విశాఖపట్నం భవిష్యత్‌లో హేపినింగ్ సీటీగానే కాక హేపీ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చే శారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఆర్థిక నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరగుపరుస్తామని పేర్కొన్నారు.

    పెందుర్తి ఎంఎల్‌ఏ బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని ఫార్మాసిటీ పరిధిలో ఉన్న సమస్యలు, డిమాండ్లు వివరించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్యను మంత్రి గంటా, ఎంపీ అవంతితో పాటు ఎమ్మెల్యేలు దుశ్శాలువా కప్పి సీల్డుతో సన్మానించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనిత, పరవాడ జడ్పీటీసీ పైలా జగన్నాథరావు, అనకాపల్లి దేశం పార్టీ నాయకులు బుద్ధ నాగజగదీశ్, మళ్ల సురేంద్ర, రొంగళి శ్రీరామమూర్తి, కాయల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement