నెల రోజుల పాటు ‘వైఎస్సార్‌ నవశకం’ కార్యాచరణ | Visakhapatnam Collector Vinay Chand Special Interview | Sakshi
Sakshi News home page

నెల రోజుల పాటు ‘వైఎస్సార్‌ నవశకం’ కార్యాచరణ

Published Wed, Nov 20 2019 12:31 PM | Last Updated on Wed, Nov 20 2019 12:31 PM

Visakhapatnam Collector Vinay Chand Special Interview - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇది నవ శకారంభం. గ్రామం లేదా వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తికర (సాట్యురేషన్‌) విధానంలో సంక్షమ పథకాలు అందించడమే లక్ష్యంగా  వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం శ్రీకారం చుట్టుకుంటోంది. రాజకీయ, వర్గ, కుల, మతాలకు అతీతంగా ఈ ప్రక్రియ సాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు కార్యాచరణ సిద్ధమైంది. జిల్లాలో బుధవారం నుంచే ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. పభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో ఇదొక భాగం మాత్రమేనని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వద్దనున్న డేటాబేస్‌లో తప్పుల సవరణ, మార్పులు చేర్పులు, సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేనివారి పేర్ల నమోదు ఈ ఇంటింటి సర్వే ప్రధాన ఉద్దేశమని అన్నారు. వైఎస్సార్‌ నవశకం కార్యక్రమంపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

పథకాల అర్హతల సడలింపు...
పలు సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. ఉదాహరణకు గతంలో రేషన్‌ కార్డు పొందాలంటే కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణాల్లో రూ.75 వేలు గరిష్టంగా ఉండేది. దాన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు గరిష్టంగా ఉండాలని మార్పులు చేశారు. ఈ ప్రకారం అర్హుల సంఖ్య పెరుగుతుంది. అందుకే ఇదొక ఇంక్లూజివ్‌ ప్రోగ్రామ్‌. ఇప్పటికే రేషన్‌కార్డులున్న వారితో పాటు కొత్తగా అర్హులను గుర్తించినవారికీ బియ్యం కార్డు, పింఛన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు అందజేస్తాం.

నెల రోజుల కార్యాచరణ 
వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం నెల రోజుల పాటు ఒక యజ్ఞంలా సాగుతుంది. బుధవారం నుంచి ఇంటింటి సర్వేతో మొదలై డిసెంబరు 20వ తేదీన లబ్ధిదారులకు కార్డుల అందజేసే వరకూ పటిష్ట కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కార్యక్రమం ఆద్యంతం పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాం. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు సీఈవో, జాయింట్‌ కలెక్టరు, జాయింట్‌ కలెక్టరు–2 పర్యవేక్షిస్తారు. ఇక శాఖల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, జీవీఎంసీ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా వైద్యాధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు.  

తుది జాబితాల ప్రదర్శన...
సర్వేలో పథకాలకు ఎవ్వరైతే అనర్హులని తేల్చారో వారి జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో డిసెంబరు 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ప్రదర్శిస్తాం. ఒకవేళ ఎవ్వరైనా తమకు అర్హత ఉన్నా ఈ జాబితాలో పేరు ఉంటే గ్రామసభ/వార్డు సభలో అభ్యర్థన ఇవ్వవచ్చు. అలా వచ్చిన అభ్యర్థనలపై ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ పథకాల అర్హతల ఆధారంగా మరోసారి పునఃపరిశీలన చేస్తాం. ఈ మేరకు సరిదిద్ది 8, 9వ తేదీల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తాం. 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ మరోసారి అభ్యంతరాలేమైనా ఉంటే వినిపించేందుకు అవకాశం ఇస్తాం. చివరకు అర్హులను ఖరారు చేయడానికి 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ గ్రామసభ, వార్డు సభలను నిర్వహిస్తాం. నాలుగు పథకాలకు సంబంధించిన కార్డుల ముద్రణ 18వ తేదీన ప్రారంభించి రెండ్రోజుల్లో ముగిస్తాం. 20వ తేదీన అర్హులకు కార్డులు అందజేస్తాం.

ప్రధాన అనర్హతలు ఇవే...
సంక్షేమ పథకాల్లో ఎక్కువవాటికి కామన్‌గా ఆరు ప్రధాన అనర్హతలు ఉన్నాయి. సొంతదైనా లేదా అద్దెదైనా సరే ఇంటి విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో సొంత ఇల్లు ఉండకూడదు. వ్యవసాయ భూమి విషయానికొస్తే మూడెకరాలకు మించి మాగాణి, పదెకరాలకు పైగా మెట్టభూమి ఉండకూడదు. ఈ రెండు పరిమితులకు లోబడి మాగాణి, మెట్ట భూమి కలిపి పదెకరాల వరకూ గరిష్టంగా ఉండవచ్చు. టాక్సీలు, ట్రాక్టర్లు మినహా మరే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఎవ్వరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్‌ ఉండకూడదు. ఈ విషయంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. ఈ వివరాలతో కూడిన ప్రిపాపులేటెడ్‌ డేటా కాపీతో వలంటీర్లు సర్వే చేస్తారు. పై అనర్హతల్లో ఏమాత్రం తేడాలున్నా ఆయా విషయాన్ని బట్టి రెవెన్యూ, విద్యుత్తు, రవాణా, మున్సిపల్‌ శాఖలకు పునఃపరిశీలన కోసం పంపిస్తాం. 

నాలుగు రకాల కార్డులు 
‘‘ఇప్పటివరకూ రేషన్‌ సరుకులు తీసుకోవకానికే కాదు పింఛన్‌కు, ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యానికి, ఉపకార వేతనాలు, కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది. అలాకాకుండా పథకానికొక కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బియ్యం కార్డు, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు... ఇలా నాలుగు రకాల కార్డులను ఆయా పథకాల లబ్ధిదారులకు ప్రత్యేకంగా అందజేయడమే వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రైస్‌ కార్డు ఇస్తున్నామంటే పాత రేషన్‌ కార్డు తీసేస్తామని కాదు. రేషన్‌ కార్డు ఎప్పటిలాగే కొనసాగుతుంది. పాతవారితో పాటు కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రైస్‌కార్డు అందజేస్తాం. 

ఏడు రకాల పథకాలు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం, అమ్మ ఒడి, వైఎస్సార్‌ కాపు నేస్తంతో పాటు చేతివృత్తిపై ఆధారపడిన దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం, ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లు, అర్చకులకు గౌరవ వేతనం తదితర ఏడు రకాల పథకాలను అందించడానికి వైఎస్సార్‌ నవశకం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 

40 వేలమంది సిబ్బంది సిద్ధం 
నెల రోజుల పాటు జరిగే వైఎస్సార్‌ నవశకం కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. వారిలో 23 వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్రస్థాయిలో జరిగే ఇంటింటి సర్వే చేయడానికి సిద్ధమయ్యారు. వారికి 12 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు.’’       

విద్యా దీవెనలో మార్పులు 
జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (ఆర్‌టీఎఫ్‌) వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యార్థికీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.20 వేలు ఇస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బోర్డు గుర్తింపు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఈ పథకాలకు అర్హత పొందాలంటే కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. పదెకరాల మాగాణి లేదా 25 ఎకరాల్లో మెట్ట భూమి ఉండవచ్చు. మాగాణి, మెట్ట భూమి కలిపి 25 ఎకరాలకు మించకూడదు. పారిశుద్ధ్య కార్మికులు మినహా మరే ఒక్క కుటుంబసభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్‌ అయిఉండకూడదు. టాక్సీ, ఆటో, ట్రాక్టరు వంటివి తప్ప మరే సొంత నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉండకూడదు. పట్టణాల్లో 1500 చదరపు అడుగులకు మించి భవనం ఉండకూడదు. 

అంతా సహకరించాలి
గ్రామ వలంటీర్లు, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే చేయడానికి వచ్చినప్పుడు ప్రజలంతా సహకరించాలి. ఈ సర్వే ఎవరికో నష్టం చేయడానికో, ఉన్న రేషన్‌ కార్డు తీసేయడానికో కాదనే విషయాన్ని గుర్తించాలి. ఎవరి కార్డులనూ తీయబోం. ప్రతి గ్రామ వలంటీరుకు 50 కుటుంబాలు చొప్పున, వార్డు వలంటీరుకు వంద కుటుంబాల చొప్పున కేటాయించాం. గ్రామ వలంటీరు తన పరిధిలో రోజుకు ఐదు, వార్డు వలంటీరు పది కుటుంబాల చొప్పున మాత్రమే సర్వే చేస్తారు. వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడానికి నిర్దిష్టమైన వివరాలతో కూడిన ప్రిపాపులేటెడ్‌ డేటా షీట్‌ను సర్వే ఫామ్‌తో కలిపి ఇస్తాం. ఈ సర్వే నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సహకరిస్తారు. వలంటీర్లు పూర్తి చేసిన సర్వే ఫామ్స్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు డేటా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ డేటాను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లకు అందిస్తారు. ఈనెల 30వ తేదీ వరకూ జరిగే సర్వే వివరాలను డిసెంబరు 1వ తేదీలోగా కంప్యూటరీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తయ్యేలా సచివాలయాల్లో ఏర్పాట్లు చేశాం.

ఏరోజుకు ఆరోజే డేటా ఎంట్రీ
గ్రామ, వార్డు వలంటీర్లు తాము సర్వే చేసి తీసుకొచ్చిన డేటాను ప్రతి రోజు సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పగిస్తారు. ఈ డేటా ఎంట్రీ విషయంలో అక్కడి వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే రైస్‌కార్డులకు సంబంధించి వీఆర్‌వో, పింఛన్లుకు సంబంధించి వెల్ఫేర్‌ అసిస్టెంట్, ఆరోగ్యశ్రీకి హెల్త్‌ అసిస్టెంట్‌... ఇలా వారివారి శాఖలకు సంబంధించి నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. 

లబ్ధిదారులకు ఎలాంటి నష్టం లేకుండా...
వైఎస్సార్‌ నవశకం పూర్తిగా ఇంక్లూజివ్‌ ప్రోగ్రామ్‌. అంటే ఇప్పటికే సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందుతున్న ఏ ఒక్కరినీ తొలగించబోరు. ఆయా లబ్ధిదారులకు ఎలాంటి నష్టం కలిగించకుండా అన్ని అర్హతలూ ఉండి సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నవారికి కొత్తగా లబ్ధి చేకూర్చాలనేదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. 

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి అర్హతల సడలింపు
దాదాపు ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. వార్షికాదాయం రూ.5 లక్షలలోపున్న వారంతా అర్హులే. భూయజమానులైతే 12 ఎకరాల్లోపు మాగాణి లేదా 35 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉండవచ్చు. మెట్ట, మాగాణి కలిపి 35 ఎకరాలకు మించకూడదు. పట్టణాల్లో 3వేల చదరపు అడుగుల విస్తీర్ణం మించి భవనం ఉండకూడదు. వ్యక్తిగతంగా ఒక్క కారు మాత్రమే ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement