సాక్షి, విశాఖపట్నం: కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల కోసం జిల్లాలో 7 వేలకు పైగా అత్యవసర బెడ్స్‌ను సిద్దం చేస్తున్నామని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ శనివారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజురోజుకి కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో రెండు, మూడు నెలల కార్యచరణను మరో 2,3 రోజుల్లో సిద్దం చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో మూడంచెల వ్యవస్ధ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకొనున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషేంట్ల కోసం ప్రత్యేకంగా వైద్య నిపుణులతో కూడిన టెలీ మెడిసిన్ సెంటర్‌ని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
ప్రత్యేక వైద్య చికిత్స అందించాల్సి ఉన్న కరోనా పేషేంట్లను మాత్రమే కోవిడ్ ఆసుపత్రులకి తరలిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్ధితుల కోసం సుమారు 15 లక్షల వ్యయంతో పది డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రులు, సెంటర్లలో నాణ్యమైన భోజన సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. కొత్త మార్గదర్శకాల ఆధారంగా భోజనం మరింత నాణ్యత ఉండేలా ఒక్కొక్క కాంట్రాక్టర్‌కి ఒక సెంటర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. విశాఖలో డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదని ఈ సందర్భంగా కలెక్టర్ స్ఫష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment