గుంటూరు రామిరెడ్డి తోట ఒకటవలైన్‌లో పింఛన్ అందుకున్న ఆనందంలో బదిర చిన్నారి దీక్షిత, అనంతపురం సెవెన్ హిల్స్ కాలనీలో పింఛన్ అందుకున్న ఓ అవ్వ సంతోషం
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: లాక్‌డౌన్, కరోనా విపత్కర పరిస్థితిల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర పింఛనుదారుల చేతికి ఒక్కపూటలోనే ప్రభుత్వం రూ. 1299.14 కోట్లు అందజేసింది. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రతినెలా ఒకటవ తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సామాజిక పింఛనుదారులకు పెన్షన్ డబ్బులు అందజేయాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా పనిచేసి వారి కళ్లలో ఆనందాన్ని నింపింది. వలంటీర్లు శుక్రవారం లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ డబ్బులను అందచేశారు.
► రాష్ట్రవ్యాప్తంగా 58,22,399 మంది పింఛనుదారులకుగాను 54,53,408 మందికి ఒకటవ తేదీనే పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. తొలిరోజు 93.66 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది.
► లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 19,960 మంది పెన్షన్‌దారులు పోర్టబులిటీ విధానంలో ప్రస్తుతం వారున్నచోటే పెన్షన్ డబ్బులు అందుకున్నారు.
► 2,37,615 మంది వలంటీర్లు శుక్రవారం తెల్లవారు జామునే పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉదయం 10 గంటల సమయానికే 44 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు అందచేశారు.
► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) సీఈవో పి.రాజాబాబు స్వయంగా పశ్చిమగోదావరి జిల్లా కలపర్రు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
► పంపిణీ సమయంలో వలంటీర్లు ముఖానికి మాస్క్‌లు ధరించి, శానిటైజర్లను ఉపయోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పంపిణీలో జాగ్రత్తలు తీసుకున్నారు.
► కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్లకు బయోమెట్రిక్ లేకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మొబైల్ యాప్ రూపొందించింది. యాప్ ద్వారా జియోట్యాగింగ్‌తో కూడిన ఫొటోలను వలంటీర్లు ఫోన్‌లో అప్‌లోడ్ చేస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు.
► ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ, డయాలసిస్ పేషెంట్లకు డీబీటీ విధానంలో పెన్షన్ సొమ్ము జమ చేశారు.
సరిహద్దుకెళ్లి పింఛను
► చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేటకు చెందిన చెందిన కస్తూరి తమిళనాడులోని కాట్పాడిలో ప్రై వేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న తన కుమారుడి వద్దకు వెళ్లి లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. వలంటీర్ వెంకటేశ్ అక్కడకే వెళ్లి ఆమెకు పింఛను అందచేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ముఖ్యమంత్రి జగన్ తమలాంటి వారికి ఎక్కడున్నా ఆర్థిక భరోసా అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఎర్రావారిపాళెం ప్రథమ స్థానం
► పింఛన్ల పంపిణీలో చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం ప్రథమ స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం 12 గంటలకే 99.52 శాతం పంపిణీ పూర్తయింది. గ్రామంలో 4,587 మంది లబ్ధిదారులు ఉండగా 4,563 మందికి పంపిణీ చేశారు. 17 మంది మృతి చెందడంతో పింఛన్లు ఇవ్వలేదు. మరో ఏడుగురు అందుబాటులో లేరు. సమన్వయంతో పంపిణీ చేపట్టిన ఎంపీడీఓ మురళీమోహన్‌రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఐసీయూలో ఉన్నా అక్కడకే..
తిరుపతి 26వ డివిజన్ బండ్ల వీధికి చెందిన చింతకుం ట లక్ష్మమ్మ (82) అనారోగ్యంతో రుయా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వలంటీర్లు ఆస్పత్రికి వెళ్లి పింఛను అందచేశారు.
ఆ కష్టం.. ఇక లేదు
‘కల్లుగీత మా వృత్తి. పదేళ్ల క్రితం చెట్టుపైకి ఎక్కినప్పుడు తాటిమట్ట గుచ్చుకొని కన్ను పోయింది. తర్వాత రెండో కన్నూ కనిపించడం మానేసింది. వృద్ధాప్యంలో నా భార్యతో కలసి పింఛను కోసం గతంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోజంతా పడిగాపులు కాశాం. ఇప్పుడా కష్టం లేదు. వలంటీరే ఇంటికొచ్చి పింఛను చేతికి అందిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ దేవుడిలా కనిపిస్తున్నారు’
– వనం పోలీసు, చీమలాపల్లి, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా
గుండెపోటుతో వలంటీర్ మృతి
► విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం పరిధిలోని కుజ్జెలి పంచాయతీకి చెందిన గ్రామ వలంటీర్ గబ్బాడ అనురాధ(26) పింఛన్లు పంపిణీ చేస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురైంది. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించింది. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment