ఓటే... వజ్రాయుధం
ప్రపంచంలోనే బలమైన ప్రజా స్వామ్య వ్యవస్థకలిగిన దేశం మనది. ఓటు హక్కు ఐదేళ్ల కొకసారి నేతల తలరాతలుమార్చే బ్రాహ్మాస్త్రం. అలాంటి వజ్రాయుధం ధరించేందుకు నేటి యువత ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఓటర్ల నమోదుకు అక్టోబర్-5వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం కల్పిం చిన అరుదైన అవకాశాన్ని జిల్లాలోని యువత చేజార్చుకుంది. జిల్లాలో 18-19 ఏళ్ల లోపు యువత లక్షా 75వేల మంది అర్హులైన ఓటర్లుంటే.. వారిలో కేవలం 26,693 మంది మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
విశాఖపట్నం : ఫేస్‌బుక్‌లు..ట్విట్టర్లు..చాటింగ్స్...వీడియో గేమ్స్ పట్ల చూపుతున్న శ్రద్ధ ఒక్క నిమిషం వెచ్చించి ఓటు హక్కు నమోదులో చూపించడం లేదు. ఫలితంగా జిల్లాలో విలువైన వజ్రాయుధాన్ని ధరించే అరుదైన అవకాశాన్ని కోల్పోతున్నారు.
సాధారణంగా జిల్లా జనాభాలో 70 శాతం మంది ఓటర్లుంటారు. ఆ ఓటర్లలో 3.8 శాతం మంది 18-19 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారుంటారని అంచనా. అక్టోబర్ ఐదో తేదీన ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 34,82,324 మంది ఓటర్లుంటే వీరిలో 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 62,250 మంది మాత్రమే ఉన్నారు. కానీ జిల్లా జనాభాను బట్టి 18-19 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఓటుహక్కుకు అర్హత కలిగిన యువత 1.75,298 మంది ఉన్నారు. కానీ ఇప్పటికే ఓటు హక్కు కలిగిన వారు కేవలం 62,250 మంది మాత్రమే. ప్రస్తుత ఓటర్ల జాబితాలో 3.8 శాతం మంది ఉండాల్సి ఉండగా, కేవలం 1.8 శాతం మంది మాత్రమే 18-19 ఏళ్ల లోపు ఓటర్లున్నారు. అంటే 18-19 ఏళ్లలోపు ఉన్న 1,75,298 మంది ఓటర్లలో ఇప్పటికే ఓటుహక్కు కలిగిన 62,250 మందిని మినహాయిస్తే ఇంకా 1,13,048 మంది ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కానీ అక్టోబర్ ఐదవ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో కేవలం 26,693 మంది మాత్రమే తమకు ఓటు హక్కు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన 86,349 మంది ఏమైనట్టు..? ఓటు హక్కు నమోదుకోసం వీరంతా ఎందు కంత నిర్లక్ష్యం..నిరాశక్తతప్రదర్శిస్తున్నారనేది ప్రశ్నగా మారింది.
రూ.కోట్లు ఖర్చు...ఫలితం ప్చ్!
ఓటుహక్కు నమోదు కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నా..చేరాల్సిన వర్గాలకు మాత్రం చేరడం లేదు. యువతలో చైతన్యం నింపడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. యువత ఓటుహక్కుకు దూరంగా ఉంటున్నారని సమావేశాలు..సమీక్షల్లో చెప్పడమే తప్ప దాన్ని అధిగమించడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అంతంతమాత్రంగానే ఉంది. కళాశాలల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా ఎక్కడా వాటి జాడ కన్పించలేదు. గత నెల 11న, ఈ నెల 1న పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వహించినా స్పందన అంతంత మాత్రమే. ఈ రెండు శిబిరాల్లో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు నాలుగైదు వేల మంది మించి లేరు.
ఆన్‌లైన్‌లో స్పందన
ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు మంచి స్పందనే కన్పిస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 40 శాతం మంది ఆన్‌లైన్ ద్వారా చేరుకున్న వారే. కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 16వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలోనెలా 10 రోజుల పాటు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో కొత్తగా 26,693మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా, ఓటు తొలగింపు కోసం 623 మంది, చేర్పులు మార్పుల కోసం 5145 మంది, నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్‌బూత్ నుంచి మరొక పోలింగ్ బూత్‌కు ఓటు బదిలీ కోసం 1,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై డిసెంబర్ -15వ తేదీ వరకు విచారణ చేస్తారు. ఓటర్ల తుదిజాబితాను జనవరి 11వ తేదీన ప్రచురించనున్నారు.