ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ డౌటే
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ డౌటే
Published Mon, Jan 27 2014 1:43 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
‘తిప్పి పంపే’ తీర్మానంపై స్పీకర్ నిర్ణయమే కీలకం
కిరణ్ తదితరుల నోటీసులపై నేడు బీఏసీ జరిగే అవకాశం
ఇందరి అభిప్రాయాలు చెప్పాక తిప్పిపంపడం సాధ్యమా?
అడ్డుకోవడానికి సిద్ధమైన తెలంగాణ ప్రజాప్రతినిధులు
గణతంత్ర వేడుకల్లో నాదెండ్లతో కిరణ్ మాటామంతీ
కిరణ్ నోటీసును తిరస్కరించాలంటూ దామోదర లేఖ
ఒక్క వ్యక్తి ఇస్తే ప్రభుత్వ నోటీసుగా పరిగణించొద్దని విజ్ఞప్తి
ఓటింగ్‌ను తప్పించేందుకే ‘తిప్పి పంపే’ ఎత్తు వేశారేమో!
కిరణ్, బాబు తీరుపై సీమాంధ్ర నేతల్లో అనుమానాలు
సాక్షి, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపుతూ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఆ తర్వాత జరిగేదేమిటి? ఇప్పుడు అందరి దృష్టీ ఈ అంశంపైనే నిలిచింది. బిల్లుపై చర్చ కోసం రాష్ట్రపతి పొడిగించిన గడువు మరో నాలుగు రోజుల్లో (జనవరి 30తో) ముగుస్తోంది. ఈ తరుణంలో బిల్లును తిప్పి పంపడం సాధ్యమేనా? ఒకవేళ పంపితే ఏమవుతుంది? అసలు అలా తిప్పి పంపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి అవకాశాలున్నాయా? ఇలాంటి పలు అంశాలపై నేతల్లో చర్చ సాగుతోంది. ఇన్ని రోజుల చర్చ తర్వాత, సాంకేతిక లోపాలను కారణంగా చూపుతూ బిల్లును కేంద్రానికి తిప్పిపంపాలని సభ ఒకవేళ తీర్మానిస్తే దానిపై ఓటింగ్ అవకాశాన్ని కోల్పోతామా అన్న మీమాంస కూడా నెలకొంది. అసలు బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఇంతకాలం పట్టుబట్టిన ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత తదితరులు ఇలా చివర్లో సాంకేతిక సాకులను తెరపైకి తేవడం బిల్లుపై ఓటింగ్ జరగకుండా చేసే ఎత్తుగడలో భాగమే అయి ఉంటుందన్న అనుమానాలు కూడా సీమాంధ్ర నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
అన్ని తీర్మానాలపైనా ఒకే నిర్ణయం!
విభజన బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు శాసనసభ నిబంధన 77 కింద స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నోటీసులివ్వడం తెలిసిందే. వాటి భవితవ్యం సోమవారం తేలనుంది. బిల్లు సభలో చర్చకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి తనకందిన మొత్తం నోటీసులపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 77, 78 నిబంధనల కింద ఇప్పటిదాకా వచ్చిన అన్ని నోటీసులపై ఏం చేయాలన్న దానిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలని స్పీకర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సోమవారం ఆయన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. నిజానికి ఈ నోటీసులపై నిర్ణయం తీసుకునే విషయంలో సభాపతిగా స్పీకర్‌కు సర్వాధికారాలున్నాయి. 77, 78 నిబంధనల కింద వచ్చే నోటీసులపై 10 రోజుల్లోగా నిర్ణయం వెలువరించే అవకాశం ఆయనకు ఉంటుంది. అయితే విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చాక మొట్టమొదటగా గత డిసెంబర్ 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూల్ 77, 78 కింద ఇచ్చిన నోటీసులు ఇప్పటికీ స్పీకర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. శనివారం కిరణ్ ఇచ్చిన నోటీసుతో పాటు వీటన్నింటిపైనా ఒక నిర్ణయానికి రావాలని ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు. బీఏసీని సోమ, లేదా మంగళవారాల్లో నిర్వహిస్తారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నా, అసాధారణ పరిస్థితి తలెత్తిందని భావిస్తే ఇలాంటి నోటీసులపై సభలోనే ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలను స్పీకర్ కోరడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే సభలో ప్రవేశపెట్టిన బిల్లులో ‘ముసాయిదా బిల్లు’ అని ఎక్కడా పేర్కొనలేదని, కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్న ముసాయిదా అన్న పదానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుతో ఏ సంబంధమూ లేదని అంటున్నారు. ఈ దశలో సభలో ఏం చేసినా దాన్నే అభిప్రాయం కింద పరిగణించాలన్న ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు వినిపిస్తోంది.
స్పీకర్‌కు డిప్యూటీ లేఖాస్త్రం
మరోవైపు 77వ నిబంధన కింద సీఎం ఇచ్చిన నోటీసులను తిరస్కరించాలని స్పీకర్‌కు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ లేఖ ఇచ్చారు. మంత్రిమండలి మొత్తం కలిస్తేనే ప్రభుత్వమవుతుందని, అలాంటప్పుడు ఒక వ్యక్తి ఇచ్చే నోటీసును ప్రభుత్వ నోటీసుగా పరిగణించరాదని లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆదివారం పార్టీలకతీతంగా సమావేశమై చర్చించారు. నోటీసులను తిరస్కరించాలంటూ సోమవారం వారంతా సభలో పట్టుబట్టే అవకాశాలున్నాయి.
తిప్పిపంపితే ఏమవుతుంది?
చివరి దశలో విభజన బిల్లును తిప్పిపంపితే ఏమవుతుందన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. పార్టీలవారీగా చూస్తే బిల్లుపై ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. సభా నాయకుడైన కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు మినహా అన్ని పార్టీకు చెందిన మిగిలిన సభ్యులందరూ బిల్లుపై లిఖితపూర్వకంగా సవరణలు ప్రతిపాదించడం, అభిప్రాయాలు తెలపడం పూర్తయింది. కిరణ్ కూడా రెండు దఫాలుగా బిల్లుపై మాట్లాడారు. బిల్లుపై చర్చ సందర్భంగా మధ్యమధ్య జోక్యం చేసుకున్న సభ్యుల అభిప్రాయాలను మినహాయించినా ఇప్పటికే 87 మంది సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రపతి పొడగించిన గడువు సైతం మరో నాలుగు రోజుల్లో ముగుస్తోంది. ఇలాంటి సమయంలో బిల్లును తిప్పిపంపుతూ సభ తీర్మానం చేయడం వల్ల ఏం జరుగుతుందన్న అంశంపై నేతల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ దశలో బిల్లును తిప్పిపంపుతూ శాసనసభ తీర్మానం చేసే ఆస్కారమే లేదని తెలంగాణ నేతలు చెబుతున్నారు. ఇంత జరిగిన తర్వాత బిల్లును తిప్పి పంపాలంటే ఆ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుందని, ఒకవేళ సాంకేతికాంశాలే ప్రాతిపదిక అని పేర్కొంటే, ఆ విషయాన్ని మొదట్లోనే ఎత్తిచూపకుండా, సభలో అన్ని పార్టీల అభిప్రాయాలూ వ్యక్తమయ్యాక ఇలా చివర్లో సందేహాలు లేవనెత్తితే ప్రయోజనాలేముంటాయన్న అంశంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
నోటీసుపై నాదెండ్లతో కిరణ్ చర్చ!
ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో కిరణ్, స్పీకర్ నాదెండ్ల పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు చాలాసేపు మాట్లాడుకోవడం కనిపించింది. కిరణ్ నోటీసుపైనే చర్చ జరిగి ఉంటుందంటున్నారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు సందర్భంగానూ వారు మాట్లాడుకోవడం కనిపించింది.
Advertisement