రాజధాని రైతులు ప్రభుత్వం ఇస్తున్న కౌలు సొమ్ము తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.
♦ భూ అంగీకార పత్రాలు వెనక్కు కోరుతున్న రాజధాని రైతులు
♦ హై కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు
తాడికొండ : రాజధాని రైతులు ప్రభుత్వం ఇస్తున్న కౌలు సొమ్ము తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కౌలుకు సంబంధించిన డీడీలు తీసుకెళ్లాలని అధికారులు ప్రకటిస్తున్నా రైతులు మాత్రం ముందుకు రావడం లేదు. నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం 29 గ్రామాల్లో జనవరి 2 తేదీ నుంచి భూసమీకరణ జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులు అభ్యంతర పత్రాలు అందజేశారు.
కొందరు స్వచ్ఛందంగా భూములు ఇవ్వగా, మరికొందరిని భయపెట్టి ప్రభుత్వం భూసమీకరణగావించింది. ఈ క్రమంలో రైతునాయకులు అభ్యంతర పత్రాలపై వివరణ కోరుతో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరో ఆరు రోజుల్లో తీర్పు వెలువడనుంది. కొద్ది రోజుల కిందట రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో తమ భూ అంగీకార పత్రాలు వెనక్కు ఇచ్చేయాలని రైతులంతా సీఆర్‌డీఏ అధికారులను కోరడం ప్రారంభించారు.
అలాగే భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇస్తున్న కౌలు సొమ్ము కింద డీడీలను కూడా తీసుకోవడం లేదు. మరో వైపు రాయపూడి, తాడేపల్లి, నవులూరు, ఉండవల్లి తదితర గ్రామాల రైతులు తమ అంగీకార పత్రాలు వెనక్కి ఇవ్వాలని సీఆర్‌డీఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలియజేస్తున్నారు.