బతుకుదెరువు కోసం వెళ్లి.. మృత్యువాత | Warangal Man Death in South Africa | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం వెళ్లి.. మృత్యువాత

Published Mon, Aug 19 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM

Warangal  Man Death in South Africa

చిట్యాల, న్యూస్‌లైన్ : ఉన్నత ఉద్యోగం చేసి.. కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుకోవాలని అతడు కన్న కలలు కల్లలయ్యూయి. 23 ఏళ్ల ప్రాయూనికే నూరేళ్లు నిండాయి. ఉద్యోగ వేటలో విదేశాలకు వెళ్లిన అతడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. చిట్యాల మండ లం ఒడితల గ్రామానికి చెందిన ఓ యువకుడు దక్షిణాఫ్రికాలో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుడి బంధువుల కథనం ప్రకారం... మాచర్ల రాధ, రాయమల్లు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దకుమారుడు రాకేష్(23) ఎనిమిదో తరగతి వరకు గొర్లవీడు హైస్కూల్‌లో, పదోతరగతి రేగొండ మండలం లింగాల భారతి హైస్కూల్లో చదివాడు. ఇంటర్ ఎంపీసీ హన్మకొండలోని బాలాజీ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కేడీసీలో చదివాడు. 2012లో ఏవియేషన్ కోర్సును బెంగళూరులో పూర్తి చేసి, అక్కడే ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తుండగా దక్షిణాఫ్రికాలో ఉంటున్న నాగార్జునతో పరిచయం ఏర్పడింది. అతడు దక్షిణాఫ్రికాలో మంచి కంపెనీలో సేల్స్ మేనేజర్ ఇప్పిస్తానని మూడు నెలల క్రితం తీసుకెళ్లాడు.

తీరా అక్కడికి వెళ్లాక ఓ కంపెనీలో సేల్స్‌ప్రమోటర్‌గా పెట్టుకున్నారని పేర్కొన్నారు. దసరా పండగ వరకు ఇంటికి వస్తానని చెప్పాడని రాకేష్ మేనమామ కన్నం రమేష్ చెప్పారు. కారులో డ్యూటీకి వెళుతుండగా ఐదు రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో రాకేష్ మృతిచెందినట్లు మూడు రోజుల తర్వాత తెలిసిందని ఆయన వెల్లడించారు. శనివారం సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్‌కు ఆదివారం వె ళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. రాకేష్ మృతితో ఒడితల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాకేష్ అంత్యక్రియల్లో వివిధ పార్టీల నాయకులు, స్నేహితులు,గ్రామప్రజలు పాల్గొని కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
 
 దసరకు వత్తనంటివికాదు బిడ్డో : తల్లి రాధ
 దసర పండుగకు వత్తనంటివి బిడ్డో.. అందరికి బట్టలు తెత్తనని చెప్తివి కొడుకో. అందరికంటె జర మంచిగ బతకాలని పోయిండు. కానరాని రాజ్యం వద్దని మెత్తుకున్న ఇనలేదు. మంచిగా చదువుకోని పెద్దగా ఎదుగుతనని చెప్పిండు. కడుపుకోత పెట్టిండు. అక్కడ ఏం జరిగిందో తెల్వదు.

 స్నేహితుడే మోసం చేశాడు : మృతుడి మేనమామ కన్నం రమేష్
 బెంగళూరులో ఎయిర్‌పోర్టులో జాబ్ చేస్తున్నపుడు ఆనందపడ్డాం. అక్కడ నాగార్జున అనే దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి పరిచయం కావడం వల్లనే రాకేష్ దక్కకుండా పోయాడు. మంచి జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిండు. రాకేష్ నా చేతిలో పెరిగిండు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement