
ఇదేం పరీక్ష..
నెల్లూరు(బారకాసు): సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి వయసు నిర్ధారణ కోసం గత మంగళవారం నుంచి చేపట్టిన దంతపరీక్షల శిబిరాలు వృద్ధులకు చుక్కలను చూపుతున్నాయి. శిబిరాలకు వచ్చేందుకు వృద్ధులు అనేక వ్యయప్రయాసాలు పడాల్సివస్తోంది. వచ్చిన వారు గంటలకొద్దీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. చివరకు పరీక్షలు జరిపిన తర్వాత తమకి వృద్ధాప్య పింఛన్ వస్తుందో రాదో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. విషయమేమిటంటే.. పింఛన్‌దారుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం అనేకమార్గాలను వెతుకుతోంది. రకరకాల కొర్రీలు, అనేక పరీక్షలు పెడుతుంది. వృద్ధాప్య పింఛన్‌కు 65 ఏళ్లు ఉంటేనే అర్హులని ప్రభుత్వం నిర్ణయిం చింది.
రేషన్, ఆధార్‌కార్డుల్లో ఉన్న వయస్సును ప్రామాణికంగా తీసుకుంది. అయితే రేషన్, ఆధార్‌ల్లో వయస్సులు అస్తవ్యస్తంగా నమోదయ్యాయి. అంతేకాకుండా రేషన్‌లో ఒక వయస్సు, ఆధార్ లో మరో వయస్సు నమోదు చేసి ఉండటంతో గందరగోళం నెలకొంది. ఇదే అవకాశంగా పింఛన్‌కు అర్హులైన అనేకమందిని అనర్హులని తేల్చి జాబితాలో నుంచి పేర్లు తొలగించారు.
దీంతో వారంతా ఆసరా కోల్పోయారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతినెలా సకాలంలో పింఛన్ తీసుకునే వారమని, బాబు ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచినట్లే పెంచి అర్హులైన అనేకమందికి తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం అనర్హులంటూ తొలగించిన వృద్ధులకు పన్ను పరీక్ష ద్వారా వయసును నిర్ధారించిన అనంతరం అర్హులైతేనే పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 20వతేదీ వరకు వయస్సు నిర్ధారణకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులచే దంత, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు.
24వేలకుపైగా తొలగింపు
గతంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 2,58,382 మంది పింఛన్లు పొందుతుండేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,33,603 మందికి మాత్రమే అందజేస్తున్నారు. అంటే 24,779 మందికి పింఛన్లు తొలగించారు. వీరిలో అధికమంది వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న వృద్ధులు ఉన్నారు. గతం లో 1,21,831 మంది వృద్ధులు పింఛన్ పొందుతుంటే నేడు 93,628 మంది మాత్రమే అందుకుంటున్నారు. అంటే 28,203 మంది వృద్ధులు అనర్హులంటూ జాబితాలోనుంచి వారి పేర్లు తొలగించారు.
బాధితుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం తొలగించిన వారిలో కొంతమందికి వయస్సు నిర్ధారణ పరీక్షలు జరిపి అర్హులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల వారు పొలంపనుల్లో కాయకష్టం చేసి ఆరోగ్యంగా ఉంటారు. దీంతో వీరి శరీ రం ధృఢంగా ఉంటుంది. 65ఏళ్లకు పైబడినప్పటికి వారంతా 60ఏళ్లలోపు వారిగానే కన్పిస్తుంటారు. అంతేగాక అప్పట్లో వారు పుట్టిన తేదీకి సంబంధిం చిన ధ్రువీకరణ పత్రాలు ఉండవు. దీంతో వారి వయసును ఖచ్చితంగా నిర్ణయించే ఆధారం లేకుండాపోయింది.
ఈకారణంగానే రేషన్, ఆధార్‌లో వారి వయసు తప్పులతడకగా నమోదయ్యాయి. నేడు ప్రభుత్వం పెడుతున్న వివిధరకాల పరీక్షల్లో పాసైతేనే పింఛన్ పొందే అవకాశం ఉంది. బాధితులు మాత్రం ఇదెక్క డి అన్యాయమని మండిపడుతున్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిన్నటివరకు బ్యాకు సిబ్బంది ద్వారా జరుగుతుండేది. జనవరి నుంచి పోస్టల్ సిబ్బంది ద్వారా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్ ద్వారానైనా పింఛన్ల పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో వేచిచూడాల్సిందే.
అర్హత ఉన్నా పింఛన్ నిలిపివేశారు
అర్హత ఉండబట్టే మొదటి నుంచి పింఛన్ పొందుతున్నాను. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నేను అనర్హుడని పింఛన్‌ను నిలిపివేశారు. ఇదెక్కడి న్యాయమో నాకు అర్ధం కావడం లేదు. 65 ఏళ్లు ఉన్నట్లు వయస్సు ధ్రువీకరణ పత్రం ఉన్నా మళ్లీ వయస్సు నిర్ధారణ పరీక్షలంటూ వైద్యశిబిరాలకు తీసుకువెళ్తున్నారు.
-వేణుగోపాల్‌రెడ్డి, కటారిపాళెం, నెల్లూరు
వితంతు పింఛన్‌కు వయస్సు నిర్ధారణ పరీక్షలా..
భర్త చనిపోతే వితంతు పింఛన్ పొందుతున్నా.. ఇప్పుడేమో వృద్ధురాలని వయసు నిర్ధారణ పరీక్షలంటున్నారు. ఎందుకో అర్ధంకావడం లేదు. పైగా 3నెలల నుంచి పింఛన్ ఇవ్వడం ఆపేశారు. ఎందుకని అడిగితే సరైన సమాధానం చెప్పే వారు లేరు. ఇక నాపరిస్థితి ఏమటనేది అర్ధం కావడంలేదు.
- చిరుకూరి సుగణమ్మ కటారిపాళెం, నెల్లూరునగరం.
తప్పు చేసింది ఒకరైతే శిక్ష నాకా..
వయసును తప్పుగా నమోదు చేసింది ఒకరైతే, శిక్ష నేను అనుభవించాలా.. పింఛన్ తొలగించేసి నేడు వయసు నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలంటున్నారు. వాస్తవంగా వితంతు పింఛన్ పొందుతుంటే వృద్ధాప్య పింఛన్‌లో పేరుందని 3 నెలల నుంచి నిలిపివేశారు. -గండవరపు భారతి,. కటారిపాళెం