గొంతెండుతున్న మన్యం | Water Problems in Visakhapatnam Agency Area | Sakshi
Sakshi News home page

గొంతెండుతున్న మన్యం

Published Mon, Jul 22 2019 1:10 PM | Last Updated on Thu, Aug 1 2019 1:10 PM

Water Problems in Visakhapatnam Agency Area - Sakshi

గుక్కెడు మంచి నీటి కోసంగిరిపల్లెలు అల్లాడిపోతున్నాయి. గ్రావిటీ పథకాలు నిరుపయోగంగా మారడంతో మైళ్ల కొద్దీ నడిచి వెళ్లి ఊట గెడ్డల నుంచి నీటిని తెచ్చుకోవలసి వస్తోంది. ఆ కలుషితమైన నీటిని తాగడంతో పలువురు వ్యాధుల బారినపడుతున్నారు.

విశాఖపట్నం, పాడేరు: మన్యంలో తాగునీటి సమస్య తీవ్ర రూపందాల్చింది. గత పాలకుల నిర్లక్ష్యం గిరిజనుల పాలిట శాపంగా మారింది. రక్షిత మంచినీటి పథకాలు లేని వందలాది గ్రామాల్లో గిరిజనులు నేటికీ   ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో చిన్న చిన్న గ్రామాల్లో   గ్రావిటీ పథకాలను   నిర్మించారు. కొండల పై ఉండే  నీటి నిల్వలను గుర్తించి, దిగువన ఉన్న గ్రామాల్లో ట్యాంకులు నిర్మించి, పైపులైన్ల ద్వారా ట్యాంకులోకి పంపి, గ్రామస్తులకు నీటి సుదుపాయం కల్పించారు.  సుమారు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చించి ఈ గ్రావిటీ పథకాలను నిర్మించారు. అయితే వేసవిలో కొండలపై నీటి నిల్వలు ఎండిపోవడంతో ఈ గ్రావిటీ పథకాలకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వేసవిలో కూడా  గ్రావిటీ పథకాలు నిరుపయోగంగా మారాయి. ఈ పథకాలతో పాటు పంపింగ్‌ స్కీమ్‌(మోటార్‌ బోరుబావులు)లను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్‌) ద్వారా మన్యంలో నిర్మిస్తోంది.  వీటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీల ద్వారా చేపట్టాల్సి ఉంది. ఏజెన్సీలో 800  పైగా గ్రావిటీ పథకాలు, 1200  పైగా పంపింగ్‌ స్కీములున్నాయి. ఏజెన్సీలో మొత్తం పంచాయతీల పరిధిలో 2028 మంచినీటి పథకాలు ఉన్నాయి. అయితే వీటి నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతో పలు పథకాలు మూలకు చేరాయి.   పాడైన పైపులు, మోటార్లకు  మరమ్మతులు సవ్యంగా జరగడం లేదు.  ఏజెన్సీలోని ఒక్కొక్క పంచాయతీ  పరిధిలో దాదాపుగా 15 నుంచి 20 గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లోని మంచినీటి పథకాల నిర్వహణ పంచాయతీల ద్వారా సాధ్యం కావడం లేదు.

రిజర్వాయర్లు లేకపోయినా వాటర్‌గ్రిడ్‌ పథకం  
గత ఏడాది ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖ జిల్లాకు వాటర్‌గ్రిడ్‌ పథకం మంజూరైంది. జిల్లాలోని మైదాన ప్రాంతాలతో పాటు ఏజెన్సీలోని ఏడు మండలాల్లో ఈ పథకం అమలు కోసం సర్వే కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాకు రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే ఇంత వరకు మన్యంలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ వాటర్‌గ్రిడ్‌ పథకం అమలు కోసం అరకు నియోజకవర్గంలోని ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకు అనంతగిరి ఆరు మండలాలతో పాటు పాడేరు నియోజకవర్గంలోని జి.మాడుగుల మండలంలో సర్వే నిర్వహించారు. ఈ ఏడు గిరిజన మండలాల్లో 482 గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చి రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రూ.68 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.  ఈ వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా రిజర్వాయర్ల నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిలు వేసి మంచినీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మన్యంలో రిజర్వాయర్లు లేనందున ఈ పథకం అమలుకు అవకాశమే లేదు. మన్యంలో ప్రతి గిరిజన కుటుంబానికి రక్షిత మంచినీరు అందించేందుకు చేపట్టవలసిన పథకాలపై  సమగ్రంగా సర్వే నిర్వహించాల్సి ఉంది. ఏజెన్సీ 11 మండల కేంద్రాల్లోనే సరైన రక్షిత మంచినీటి పథకాల్లేవు. ఆర్‌డబ్ల్యూఎస్‌ గణాంకాల ప్రకారం మన్యంలో ఇప్పటి వరకు 1897 గ్రామాలకు మంచినీటి పథకాలు అందుబాటులో లేవు. ఏజెన్సీ వ్యాప్తంగా 3760 గ్రామాలుంటే 2055 గ్రామాలకు మంచినీటి పథకాలు(52శాతం) అందుబాటులో ఉండగా మిగిలిన గ్రామాల్లో కుండీలు, బోరుబావులు, నుయ్యిలు వంటి చిన్న చిన్న తాగునీటి వసతులున్నాయి. మన్యంలో దూరదూరంగా ఉండే గ్రామాల్లో ప్రత్యేక రక్షిత మంచినీటి పథకాలతో మండల స్థాయి, పంచాయతీల స్థాయిలో మల్లీ విలేజ్‌ స్కీమ్స్‌ను నిర్మించి ఆర్‌డబ్ల్యూఎస్‌ నిర్వహణ ద్వారా అందుబాటులోకి తెస్తే గిరిజనుల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వాటర్‌గ్రిడ్‌ పథకంతో గిరిజనుల తాగునీటి సమస్యకు  శాశ్వత పరిష్కారం చూపే విధంగా సమగ్ర సర్వే ద్వారా మన్యంలో చేపట్టే  మంచినీటి పథకాల నిర్మాణానికి రూపకల్పన చేయవలసి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement