మంచి నీటికీ ఆంక్షలే!
పలమనేరు : వేసవిలోకంటే ఇప్పుడే నీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలోని సగానికిపైగా గ్రామాల్లో మంచినీటికి తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వడం లేదు. కనీసం డీపెనింగ్ (ఉన్న బోర్లను లోతు చేసేందుకు)కు సైతం ఒప్పుకోవడం లేదు. కేవలం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయిస్తూ కంటితుడుపు చర్యలను అవలంభిస్తొంది. ఫలితంగా పల్లెజనం పర్లాంగుల దూరం వెళ్లి వ్యవసాయ బోర్లనుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.
ఆంక్షలతో ఆగిన రూ.24 కోట్లు
ప్రభుత్వ ఆంక్షల కారణంగా జిల్లాలోని ఖజానాలో 13 ఆర్థిక సంఘం నిధులు రూ.24 కోట్ల స్తభించిపోయాయి. వీటిని నమ్మి గ్రామాల్లో స్కీమ్ బోర్లకు సంబంధించిన మోటార్ల మరమ్మతులు, రీవైండింగ్ వర్క్స్, పైప్‌లైన్లు, డీపెనింగ్, స్టార్టర్ల రిపేర్లు, గతంలో వేసిన కొత్త బోర్లు తదితరాాలకు బిల్లులు పూర్తిగా ఆగిపోయాయి. సుమారు రూ.పది కోట్ల దాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో సర్పంచులు నిత్యం ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల మేరకు పంచాయతీల 13 ఆర్థిక సంఘం నిధులను కేవలం మంచినీటి సమస్య, పారిశుధ్యం పనులకు మాత్రమే వెచ్చించాలి. అసలే జిల్లాలో డెంగీలాంటి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పల్లెల్లో పారిశుధ్యం లోపించింది. ఇన్ని సమస్యల మధ్య ప్రభుత్వం ఎందుకు నిధులపై ఆంక్షలు పెట్టిందోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
14వ ఆర్థిక సంఘ నిధులకూ ఇదే ఆంక్షలట
2015 మార్చి నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఓ త్రైమాసికం ముగిసింది. రెండో త్రైమాసికం కూడా పూర్తవుతోంది. ఇందుకు సంబంధించిన పంచాయతీల నిధులు రూ.125 కోట్లు ఇప్పటికీ రాకపోగా ఇవి మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిని కూడా కేవలం సీసీ రోడ్లకు మాత్రమే వినియోగించాలనే షరతులు పెట్టారు. ఆలెక్కన ఈ నిధులు వచ్చినా తాగునీరు, పారిశుధ్యానికి వాడుకునే అవకాశం లేనట్టే.
అసలు తిరకాసు ఇదీ..
ప్రస్తుతం జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగింది కేవలం 20 శాతమే. వీటికైతే ఖజానాలో ఉన్న నిధులను సులభంగా ఇవ్వొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతోనే ఈ ఆంక్షలను పెట్టిందని జిల్లాస్థాయి అధికారులకు తెలియందేమీ కాదు. కానీ అలా చెప్పలేక ప్రభుత్వ ‘ఆదేశాలున్నాయి త్వరలో చూస్తాంలే’ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని చూపుతున్నట్టు అర్థమవుతోంది. ఈవిషయమై పలమనేరు ఉప ఖజానా అధికారి రాజేంద్రను వివరణ కోరగా తమకు జిల్లా పంచాయతీ అధికారి నుంచి అందిన ఆదేశాల మేరకే 13వ ఫైనాన్స్ నిధుల బిల్లులను ఆపేశామన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధులకు కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ అడ్జెస్ట్ కాలేదన్నారు.
ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావును వివరణ కోరగా ఆంక్షలు ఇక్కడే కాదు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నాయన్నారు. ఇక ట్రెజరీల్లో రూ.40.88 కోట్లు త్వరలోనే జమ కావచ్చునన్నారు. అయితే వాటిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం ఆంక్షలను రద్దు చేస్తేనే పెండింగ్ బిల్లుల సమస్య తీరుతుందన్నారు. ప్రభుత్వ షరతులతో జిల్లాలో మంచినీటికి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.