సాక్షి, విజయవాడ :
రబీలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం తగ్గుతుంటే.. పదివేల క్యూసెక్కుల నీరు కావాలని నాగార్జునసాగర్ డ్యాం అధికారులను కోరితే ఇవ్వడానికే మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు నీరు అందక పంటలు ఎండుతున్న దుస్థితి జిల్లాలో నెలకొంది. దీంతో మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఆందోళన మొదలైన తర్వాత నీటి విడుదలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడంతో సాగునీరు వస్తుందా.. అన్న అనుమానం అధికారులు, రైతులను వెంటాడుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితేగానీ మన రాష్ట్రానికి నీరు విడుదల కాదు. కృష్ణాడెల్టాకు రైపేరియన్ రైట్స్ (మొదట ఏర్పడిన ఆయకట్టుకు ముందుగా నీరు ఇవ్వాలి) చట్టప్రకారం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
ఆంధ్ర ఎడారిగా మారుతుందా..
జూన్‌లో ఖరీఫ్‌కు నీరు ఇస్తే గానీ పంట చేతికి అందని పరిస్థితి ఉంది. సముద్రతీర ప్రాంతం కావడంతో ఏటా నవంబర్, డిసెంబర్‌ల్లో తుపాన్లు ఈ ప్రాంతాన్ని తాకుతాయి. ఈలోగా పంట చేతికి రానిపక్షంలో నీటిపాలు కాకతప్పదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే.. తెలంగాణవాదుల ఒత్తిళ్లకు భయపడి నీటి విడుదల జాప్యం చేయడంతో ఇప్పటికీ డెల్టాలో పూర్తిగా పంటలు వేయని పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 510 అడుగుల కంటే తక్కువ ఉంటే నీరు విడుదల చేయరాదన్న జీవోను అడ్డం పెట్టుకుని గత ఏడాది సాగర్, కృష్ణాడెల్టా ఆయకట్టులకు చుక్కనీరు వదల్లేదు. అయితే వర్షాలు బాగా ఉండటంతో ఖరీఫ్ పంట చేతికి వచ్చింది. నీరు లేదనే సాకుతో రబీకి క్రాప్‌హాలిడే ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకతో జల వివాదం నడుస్తోంది. నీటి వనరుల పంపిణీ తేల్చకుండా రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఆంధ్ర ఎడారిగా మారుతుందన్న భయం రైతులను వెంటాడుతోంది.
నాలుగు జిల్లాలకు కరువే..
కృష్ణానది జలాలు ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించినా, మహారాష్ట్ర, కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తుండటం వల్ల 409 మాత్రమే శ్రీశైలం వద్దకు చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు మాత్రమే సాగయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక తమకు కేటాయించిన నీటి కంటే అధికంగా 283 టీఎంసీలు వినియోగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం, అలాగే తుంగభధ్ర దిగువన, కృష్ణా-భీమా నదులకు దిగువన అనేక అనుమతులు లేని చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలు చేపట్టడం వల్ల నీరు దిగువకు రావడం తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే కోస్తా ప్రాంతంలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంతభాగం బీడువారే అవకాశం ఉంది.
గడ్డుకాలమే...
మరోవైపు గోదావరిపై పోలవరం ప్రాజెక్టు కడితే కృష్ణాడెల్టాకు 80 టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశ ం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే చెప్పాలి. దీంతో వరి తప్ప మరో పంట పండని కృష్ణాజిల్లా నల్లరేగడి భూములు నీరు లేక బీడులుగా మారుతాయి. అంతేకాదు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి సాంద్రత పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే నిపుణుల అంచనాల ప్రకారం విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంకిపాడు వరకూ ఉప్పు నీటి సాంద్రత పెరిగిందని చెబుతున్నారు. నదీ జలాల వివాదాలను పరిష్కరించకుండా సీట్లు, ఓట్ల కోసం రాష్ట్రాన్ని విడదీస్తే 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న కృష్ణాడెల్టా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది.
నీరు పారేనా... ఇక డెల్టా పండేనా
Published Wed, Feb 19 2014 5:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement