ప్రాజెక్టులు నిండుగా.. రబీ దండిగా
• 30 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక
• భారీ ప్రాజెక్టుల కింద 22 లక్షల ఎకరాలకు నీరు
• ఎస్సారెస్పీ కింద 9.68 లక్షల ఎకరాలు
• నాగార్జునసాగర్ కింద 6.40 లక్షల ఎకరాలు
• మధ్య తరహా ప్రాజెక్టుల కింద 3 లక్షల ఎకరాలకు..
• చెరువుల కింద మరో 5 లక్షల ఎకరాలకు నీరు
• 18న రబీ తుది కార్యాచరణ రూపొందించనున్న నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు మళ్లీ పునర్జీవం రానుంది. ఈసారి భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో వాటి కింద పూర్తిస్థాయి ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. రబీలో ప్రాజెక్టుల కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల మేర పంటలకు నీరిచ్చేందుకు నీటిపారుదల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భారీ ప్రాజెక్టుల కిందే 22 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇక మధ్య, చిన్న తరహా ప్రాజెక్టు కింద మరో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని భావిస్తోంది.
ఇప్పటివరకు సగటు 23.35 లక్షలే
రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా, ఐడీసీ పథకాల కింద ఏటా 63.52 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉండగా.. సగటున 23.35 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. గడిచిన ఎనిమిదేళ్ల లెక్కలు చూస్తే 2013-14లో అత్యధికంగా అన్ని ప్రాజెక్టుల కింద కలిపి 28.15 లక్షల ఎకరాలకు నీరందింది. 2014-15లో అత్యల్పంగా 9.74 లక్షల ఎకరాలకే నీరందింది. 2015-16లో 21.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్ మినహా అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.
శ్రీశైలం పూర్తిగా నిండటం, కృష్ణా బేసిన్ పరిధిలో డిసెంబర్ వరకూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున సాగర్ కూడా నిండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రబీలో అన్ని ప్రధాన ప్రాజెక్టుల కింద పంటలకు నీరిచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ తదితర ప్రాజెక్టుల పరిధిలో 21.29 లక్షల మేర ఆయకట్టు ఉంది. ఇందులో ఆర్డీఎస్ మినహా మిగతా ప్రాజెక్టుల కింద మొత్తం 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశాలున్నాయి. ఇందులో అధికంగా ఎస్సారెస్పీ కింద 9.68 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి.
వీటితోపాటు పాక్షికంగా పూర్తయిన ఏఎంఆర్‌పీ, ఎస్సారెస్పీ-2, దేవాదుల, ఎల్లంపల్లి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొమురంభీం, కోయిల్‌సాగర్, వరద కాల్వ, సింగూరు వంటి ప్రాజెక్టుల కింద 2 నుంచి 3 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఇందులో అధికంగా ఏఎంఆర్‌పీ కింద 1.3 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రణాళికలున్నాయి. ప్రస్తుత నీటితో సింగూరు కింద 40 వేల ఎకరాలు, ఎల్లంపల్లి కింద 30 వేల ఎక రాలకు నీరు అందించవచ్చు. మొత్తంగా భారీ ప్రాజెక్టు కింద 22 నుంచి 23 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి.
మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఇలా
రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టుల కింద 3.22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా సగటున 2.08 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఇక చిన్న తరహా వనరుల కింద 24.39 లక్షల ఎకరాలు ఉండగా.. 6 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 28 మధ్యతరహా ప్రాజెక్టులు నిండటంతో సుమారు 3 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. 20 వేలకు పైగా చెరువులు పూర్తిస్థాయిలో నిండటం, మిగతాచోట్ల ఆశాజనకంగా నీరు అందుబాటులో ఉన్నందున 5 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి. దీనిపై ఈ నెల 18న పూర్తిస్థాయిలో సమీక్షించి తుది రబీ ప్రణాళికను నీటి పారుదల శాఖ ఖరారు చేయనుంది.