వాళ్లకు మేము వ్యతిరేకం కాదు | We are not against them | Sakshi
Sakshi News home page

వాళ్లకు మేము వ్యతిరేకం కాదు

Published Sat, Dec 21 2013 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

We are not against them

తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ‘‘కలియుగ శ్రీవేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలలో బీబీనాంచారిని హిందూ, ముస్లింలు కలసి కొలుస్తున్నాం. తిరుపతిలో స్థిరపడిన ముస్లింల కు మేము వ్యతిరేకం కాదు. వారంటే ఎనలేని గౌరవం ఉంది. మా పోరాటం  చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న ఇస్లామిక్ అంతర్జాతీయ కళాశాలపైన మాత్రమే’’ అని పలువురు స్వామీజీలు తెలిపారు. తిరుపతి సమీపంలో నిర్మిస్తున్న ఇస్లామిక్ అంతర్జాతీయ కళాశాలను తొలగించాలి, తిరుపతిని రక్షించాలి అనే నినాదంతో శుక్రవారం తిరుపతి తుడా మైదానంలో ‘హిందూ గర్జన’ సభ నిర్వహించారు.

తిరుమల తిరుపతి సంరక్షణ వేదిక, హిందూ జనజాగృతి సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు ఆరు రాష్ట్రాల నుంచి వేలాది మంది సాధువులు, స్వామీజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ హిందూ ధార్మిక కేంద్రమైన తిరుపతిలో చట్టవిరుద్ధంగా ఇస్లామిక్ అంతర్జాతీయ కళాశాల నిర్మించడం అశుభం అన్నారు. ఈ విషయంలో తిరుపతిలోని ముస్లింలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ సగటు భారత దేశంలో ముస్లిం, క్రైస్తవ సోదరులతో కలసి సహజీవనం చేస్తున్నామని అయినా హిందువులను రెండవ శ్రేణులుగా చూడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇస్లామిక్ కళాశాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దానిని పూర్తిగా తొలగించేంతవరకు తమ న్యాయమైన పోరాటం ఆగదన్నారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల చేతిలో హత్యకు గురైన అటవీ అధికారులకు రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
 
ఉద్రిక్తత నడుమ.. సభ విజయవంతం

సభకు పోలీసులు, తుడా అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో, రోడ్డుపైనే సభను జరుపుకుంటామని స్వామీజీలు గురువారం హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 7గంటల వరకు అనుమతి రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో స్వామీజీలు పోలీసులను నెట్టుకుంటూ గేట్లను బలవంతంగా తోసుకుంటూ మైదానంలోకి దూసుకెళ్లారు. వేలమంది మైదానాన్ని ఆక్రమించుకోవడంతో చేసేది లేక పోలీసు లు మిన్నకుండిపోయారు. కార్యక్రమంలో పలువురి స్వామీజీలతో పాటు ధర్మ ప్రచార పరిషత్ గవరయ్య, మంజులాశ్రీ, రామాంజనేయులు, ఆకుల కృష్ణకిషోర్, కల్లూరి చెంగయ్య, బాలాజీ, ప్రసాద్, మద్దెలచెరువు సూరి భార్య భానుమతి పాల్గొన్నారు. కాగా ఇస్లామిక్ కళాశాల వద్ద ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement