మాటిస్తే కట్టుబడి ఉంటాం | We Give Complete Hope To People Said Balineni Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

మాటిస్తే కట్టుబడి ఉంటాం

Published Mon, Mar 4 2019 1:30 PM | Last Updated on Mon, Mar 4 2019 1:31 PM

We Give Complete Hope To People Said Balineni Srinivasa Reddy - Sakshi

బాలినేని, భానుచందర్‌లకు జ్ఞాపిక అందజేస్తున్న నూర్‌బాషా సంఘ సభ్యులు

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాటిస్తే అందుకు కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు ఇచ్చిన మాటపై వెనుకడుగు వేసేది లేదని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆదివారం ఒంగోలులోని  పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో నూర్‌బాషాల సంఘ రాష్ట్రస్థాయి ఆత్మీయ సదస్సు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే నాగూర్‌ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలినేని మాట్లాడుతూ నూర్‌బాషాలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

అనంతపురం పార్లమెంట్‌ స్థానాన్ని జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు కేటాయించినట్లుగా గుర్తు చేశారు. అవకాశం ఉన్న చోట తప్పని సరిగా నూర్‌బాషాలకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని కొణిజేడు బస్టాండ్‌ సెంటర్‌లో అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని  ఏర్పాటు చేయిస్తామని బాలినేని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి అనుమతులు లభించే అవకాశం లేనందున, పార్టీ  అధికారంలోకి రాగానే ముందుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు దామచర్ల ఆంజనేయులు విగ్రహం ఏర్పాటుకు నాడు అధికారులు అంగీకరించకపోతే కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి అనుమతులను ఇప్పించినట్లుగా గుర్తు చేశారు. ఆ విశ్వాసం కూడా ఆయన మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే జనార్దన్‌కు లేదన్నారు. పార్టీ «అధికారంలోకి రాగానే విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్‌ సీఎం అయితే సమస్యల పరిష్కారం..

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటే నూర్‌బాషాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. టీడీపీ బీసీలను కరివేపాకులా వాడుకుందని విమర్శించారు. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నూర్‌బాషాలు వైఎస్సార్‌ సీపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సినీ నటులు, వైఎస్సార్‌ సీపీ  నాయకుడు భానుచందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే పాతికేళ్ల పాటు జనం హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. దివంగత వైఎస్సార్‌ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జగన్‌ ప్రతి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయన అండగా ఉంటారని వివరించారు.

జగన్‌ ప్రభుత్వం ఏర్పాటులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. నూర్‌బాషా సంఘం ఉభయ రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఓ.రసూల్‌ సాహెబ్, సంఘ నాయకులు పలు అంశాలను బాలినేని దృష్టికి తెచ్చారు. ఆయన ఈ సమస్యలన్నీ విని అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంఘ నేతలు మస్తాన్‌(గుంటూరు), ఎస్‌ఎస్‌ బాబ్జి (ఉంగుటూరు), నిజాం (అనంతపురం), కరిముల్లా (చిత్తూరు), ఖాజా(కర్నూలు), మున్నీ(విశాఖ), రహీం(విజయవాడ)లు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి ఖాశింపీరా, పార్టీ నూర్‌భాషాల సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయగిరి ఇమాంబాషా, చిన్నబాషా, హుస్సేన్‌ సైదులు, షేక్‌ శ్రీనుబాషా, మస్తాన్, లాల్, టైలర్‌ ఖాశిం తదితరులు పాల్గొన్నారు.

నూర్‌బాషాల డిమాండ్లు ఇవీ..

  •  నూర్‌బాషాలకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌
  •  అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అబ్దుల్‌ కలాం విగ్రహాల ఏర్పాటు 
  •  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్‌ పోస్టులతో పాటు వక్ఫ్‌బోర్డ్‌లో ప్రాధాన్యం
  •  రాజధానిలో 5 ఎకరాల స్థలం కేటాయించి అందులో సామాజిక భవన నిర్మాణం
  •  రూ.2 లక్షల సబ్సిడీతో బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు
  •  4 చక్రాల వాహనాలకు రుణ సదుపాయం
  •  45 ఏళ్లు దాటిన దూదేకుల వృత్తి వారికి పింఛన్‌ ఇవ్వాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement