చీమకుర్తి ప్రభుత్వ హైస్కూల్లో సైకిళ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే టీజేఆర్(ఫైల్)
సాక్షి, ప్రకాశం (చీమకుర్తి) : ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు నేటి వరకు మొత్తం 150 రోజులలో 130 రోజుల పాటు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు జనం మనిషిగా ముద్ర వేయించుకున్నారు. ఎమ్మెల్యే టీజేఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు బుధవారం కూడా తన నియోజకవర్గంలోని పేర్నమిట్ట నుంచి చీమకుర్తి శివారు ప్రాంతమైన మర్రిచెట్లపాలెం వరకు కర్నూల్‌రోడ్డు పొడవునా దాదాపు 30 కి.మీ పొడవునా రోడ్డుకి ఇరువైపులా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టి సేవాకార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు.
రైతుల కోసం అలుపెరగని సేవలు..
రామతీర్థం రిజర్వాయర్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లను సాగర్ జలాలతో నింపేందుకు ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సీఈ, ఎస్‌ఈలను కలిశారు. కలెక్టర్‌ను కలిసి రైతులకు నీటి కోసం ఎందాకైనా పోతానంటూ అధికారులను పరుగులు పెట్టించారు. శనగ పంట గిట్టుబాటు ధరల కోసం రూ.1500 రాయితీలు, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో 3 చెక్‌డ్యామ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటైన సచివాలయాల భవనాలకు రూ.10 కోట్ల నిధులను ఎమ్మెల్యే విడుదల చేయించారు. అదే విధంగా పలు గ్రామాలలో మురుగు కాలువల నిర్మాణానికి మరో రూ.15 కోట్లు కేటాయింపజేశారు. నాలుగు మండలాలలో దాదాపు 1200 మంది వలంటీర్‌లను నియమించటంలో ఎమ్మెల్యే నిరుద్యోగులకు తగిన ప్రాధాన్యం కల్పించి ఇప్పించారు.
రంగాల వారీగా సమీక్షలు
గ్రానైట్ క్వారీల యజమానులు, గ్రానైట్ ఫ్యాక్టరీలు, కంకరమిల్లుల యజమానులతో వేరువేరుగా సమీక్షలు నిర్వహించారు. శాఖల వారీగా రవాణా,ఇరిగేషన్, ఉపాధి, మండల పరిషత్, రెవెన్యూ, మార్కెట్‌శాఖ అధికారులతో వేరువేరుగా సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల నుంచి ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని అధికారులను ఆదేశించారు.
నేడు వైఎస్, బూచేపల్లి విగ్రహాలకు శంకుస్థాపన
ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా నేడు బుధవారం చీమకుర్తిలోని తూర్పుబైపాస్ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంతో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలు ఏర్పాటు, పైలాన్, ఆర్చి నిర్మాణాలకు ఎమ్మెల్యే టీజేఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment