సోనియా దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాసయ్యేంత వరకు కాంగ్రెస్‌ను నమ్మలేమని, ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై జరిగే చర్చలో తాము పాల్గొని, సీమాంధ్ర సహా అన్ని ప్రాంతాల సమస్యల్ని ప్రస్తావిస్తామని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు బోడ జనార్దన్, దేవిశెట్టి శ్రీనివాసరావు, నిట్టు వేణుగోపాలరావు, జేఏసీ నేతలు మహేష్ కుమార్, ఫణిందర్, శంకర్‌గౌడ్ తదితరులు పెద్దసంఖ్యలో శనివారమిక్కడ బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు 11 వందల మంది అమరవీరుల త్యాగఫలమని, సోనియా దయాదాక్షిణ్యాలతో రాలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసమే సీమాంధ్రలో కొన్ని పార్టీలు సమైక్యవాదాన్ని నెత్తికెత్తుకున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణపై తమ పార్టీ వెనక్కుపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 2002 గోద్రా అల్లర్ల కేసుతో సంబంధం లేదని అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే మరో కేసులో మోడీపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు, జి.రామకృష్ణారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మిషన్ 272 పక్కా!
కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నిర్ణయించుకున్న ప్రజలు తమకు తప్పకుండా 272 లోక్‌సభ సీట్లు కట్టబెడతారని కిషన్‌రెడ్డి అంతకుముందు జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బస్ దగ్ధమై మరణించిన 46 మంది కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దుర్ఘటనపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంఘటనాస్థలికి సీనియర్ నేత బండారు దత్తాత్రేయను పంపామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బీజేపీ వైపు కొమ్మూరి చూపు?
వరంగల్ జిల్లా జనగాం నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి రవీంద్ర నాయక్ బీజేపీలో చేరనున్నారు. ఈమేరకు వీరిరువురూ శనివారమిక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇతర సీనియర్లతో చర్చలు జరిపారు. వచ్చేనెల 5న వీరిద్దరూ జనగాంలో జరిగే సభలో కాషాయతీర్థం తీసుకోనున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్‌ను నమ్మలేం: కిషన్‌రెడ్డి
Published Sun, Dec 29 2013 2:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement