సమైక్య ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్రలో స్కూళ్లు, కార్యాలయాలు, బస్సులు బంద్ పాటించడం సరికాదని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.జయప్రకాష్ నారాయణ (జేపీ) అభిప్రాయపడ్డారు. ఆ బంద్ వల్ల అయా ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.
స్థానికంగా బంద్లు, సమ్మెలు చేసే కంటే సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు ఢిల్లీ పెద్దలపై పోరాడితే ఫలితం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమకు స్వయం ప్రతిపత్తి కోరితే ఫలితం ఉంటుందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో తెలుగు ప్రజల ప్రతిష్ట, వైభవాన్ని పరిరక్షించేందుకు లోక్సత్తా తెలుగు తేజం పేరుతో విస్తృత కార్యాచరణ చేపట్టింది. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో తలెత్తిన సమస్యలకు సామరస్య పరిష్కారం దిశగా ప్రజలన సమీకరించేందుకు ఆ పార్టీ నడుంబిగించింది.
ఈనేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాయలసీమా, కోస్తాంధ్ర జిల్లాల్లోని ఆయన పర్యటించి పలు ప్రధాన పట్టణాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు, బహిరంగసభలు నిర్వహిస్తారు. అందులో భాగంగా కర్నూలులో జయప్రకాశ్ నారాయణ శనివారం తెలుగుతేజం యాత్రను కర్నూలులో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.